టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత, సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆహా.. ఈ విషయంలో జగన్ ను మెచ్చుకుంటున్నా“ అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఉప్పు-నిప్పులా ఉండే ఇరువురు నేతల విషయంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. మంగళవారం సీఎం జగన్.. చంద్రబాబును ఉద్దేశించి.. అరుంధతి సినిమాలో విలన్ `పశుపతి`తో పోల్చారు. పశుపతి.. పశుపతి.. అంటూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. ఈ కామెంట్లపై తాజాగా స్పందించిన చంద్రబాబు.. జగన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.
“జగన్ నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా.. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా మీరు చూస్తున్నారు… నన్ను అనేక మాటలు అన్నారు, మిత్రుడు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన… మళ్లీ తెలుగుజా తిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడ్ని అవుతున్నా. అందుకే నేనే పశుపతిని“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పొత్తుపై మరోసారి..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తం గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని, నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఓట్లు ఎలా అడుగుతావ్ జగన్?
“మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పావు. కానీ జనాలను మోసం చేశావు. నాణ్యత లేని బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. రూ.60 క్వార్టర్ బాటిల్ ఇవాళ రూ.200 పలుకుతోంది. రూ.140 ఎవరి జేబులోకి పోతోంది? మద్యం తయారుచేసేది వీళ్లే, సరఫరా చేసేది వీళ్లే, అమ్మేది వీళ్లే, డబ్బులు కూడా వీళ్లకే. మళ్లా మద్య నిషేధం అని చెప్పి ఓట్లు పొందాలనే కుట్ర రాజకీయం కూడా వీళ్లదే. ఐదేళ్ల తర్వాత జనాల్లోకి వస్తున్నాడు. మొన్నటిదాకా ఆకాశంలో ఈయన వస్తే కింద ఉన్న చెట్లు కొట్టేసేవారు. మోసపూరితమైన మాటలు చెబుతూ, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. ప్రజలు అతడ్ని అడుగడుగునా నిలదీయాలి. మద్యపాన నిషేధం తర్వాతే ఓటు అడుగుతానని చెప్పాడు.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతావ్ జగన్“ అని చంద్రబాబు నిలదీశారు.