ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులు , అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు పోలింగ్ సందర్భంగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ మద్దతుదారులు, అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీసీ దాష్టీకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలని, ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతిలో వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనరే టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
విజయవాడ 8వ డివిజన్ వైసీపీ అభ్యర్థి భర్త కొత్తపల్లి రాజశేఖర్ టీడీపీ నేతలపై దాడి చేశారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 4వ వార్డు అభ్యర్ధి కాలేజీ సిబ్బందిని ఆర్వోలుగా నియామించారని ఆక్షేపించారు. తిరుపతి 18వ డివిజన్లో దొంగ ఓట్లు వేసేందుకు చెవిరెడ్డి సోదరుడు ప్రయత్నించారని ఆరోపించారు.
వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ శాతం పెరగకుండా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రజాస్వామ్య రక్షకులని… స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. ఎవ్వరికీ భయపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.