తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని భావించే ఉత్తరాంధ్రకు గత ఏడాది బీటలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత అలర్ట్ అయ్యారు. ఉత్తరాంధ్రపైనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం దిద్దనున్నారు.
ఇప్పటికే ఓ విడతలో శ్రీకాకుళం లో రోడ్ షో నిర్వహించి, జనాలను విశేషంగా ఆకట్టుకున్నారాయన. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకుని పోయేందుకు ఈ నెల 15 నుంచి బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టాలని భావిస్తూ, ఇందుకు చోడవరం ను ప్రారంభ స్థానంగా ఎంచుకున్నారు.
మలివిడత పర్యటనలో భాగంగా మూడ్రోజుల పాటు ఉత్తరాంధ్రలోనే ఆయన మకాం వేయనున్నారు. పూర్తిగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి నిలపనున్నారు. ఈ నెల 15న చోడవరంలో పర్యటించాక, అక్కడ నిర్వహించే మినీమహానాడులో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. అటుపై విజయనగరం చేరుకుని, మంత్రి బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలో రోడ్ షో చేయనున్నారు.
వాస్తవానికి మహానాడు విజయవంతం అయిన నాటి నుంచి బాబు మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఎలా అయినా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుగుణంగా మలుచుకునేందుకు జిల్లాల పర్యటనలే కీలకం అని భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రానున్న ఏడాదిలో 26 జిల్లాల్లోనూ పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు.
జిల్లాల పర్యటనల్లో భాగంగా ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా మొదటి రోజు మహానాడు నిర్వహిస్తారు. రెండో రోజు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో సమీక్షలూ, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలూ నిర్వహిస్తారు. మూడో రోజు ఆ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఏటా 80కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకలాపాలు సమాంతరంగా సాగే విధంగా షెడ్యూల్ ను వేశారు.