ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టి ఓటర్లు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. నూతన ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టింది మొదలు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు నడుం బిగించారు. అలాగే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. 3.0 వెర్షన్ చూపిస్తున్నారు.
నిజానికి అధికారం.. ప్రతిపక్షం ఇవి రెండూ ఆయనకు కొత్తేమీ కాదు. కానీ గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు, పడిన అవస్థలు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం ఇందుకు నిదర్శనంగా మారింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే కేంద్రంలో చక్రం తిప్పాలనే తపన చంద్రబాబుకు ఎప్పటినుంచో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తన కోరిక తీర్చుకోవాలని ఆశపడ్డారు. కానీ మోడీ తీరుతో అది సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వైకాపా అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మరియు ఆయన పార్టీ నేతలు అష్ట కష్టాలు పడ్డారు.
వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి జాతీయస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు బలంగా ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ విషయంలో ఎలాంటి హడావుడి నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే స్పీకర్ పదవి తీసుకోవాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేయగా.. ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించారు. పదవులు కన్నా రాష్ట్రానికి నిధులు మంజూరు కావడమే ముఖ్యమని చంద్రబాబు అమిత్ షాతో తెలిపారు.
ఈ విషయాన్ని ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు షేర్ చేసుకున్నారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న టీడీపీకి పదవులతో సంబంధం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు తేల్చేశారు. పదవుల కోసం పాకులాడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. పార్లమెంటులో ఈసారి టీడీపీ 16 ఎంపీల బలం ఉందని.. కాబట్టి ఏపీకి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ విషయం తెలిసిన వారంతా బాబులో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీలో చక్రం తిప్పడం కన్నా..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికే ఆయన మొగ్గు చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.