వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి. అధికారంలోకి రావాలి.. ఇదీ.. టీడీపీ పెట్టుకున్న పెద్ద లక్ష్యం. అయితే.. ఈ లక్ష్యం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లదేనా.? ఇతర నేతలకు వర్తించదా? ఇదీ..ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. చంద్రబాబు చెబితే చేస్తాం.. లేకపోతే.. లేదు! అన్నట్టుగా చాలా మంది నాయకులు వ్యవహరిస్తున్నారు. ఏదైనా పెద్ద రగడ జరిగితే తప్ప తమ్ముళ్లు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.
నిజానికి.. టీడీపీ గెలుపు ఇప్పుడున్న పరిస్థితిలో అందరి లక్ష్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన టీడీపీ ఈ మధ్య కాలంలో అధికార పార్టీ నేతల నుంచి అనేక ఆటు పోట్లు ఎదుర్కొంది. లెక్కలేనన్న కేసులతో నాయకులు.. తిప్పలు పడ్డారు.. పడుతున్నారు. అంతేకాదు.. కనీసం సోషల్ మీడియాలోనూ భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీని సజీవం చేసుకునేందుకు గెలుపు మంత్రం పఠించాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
కానీ, ఎందుకో చాలా నియోజకవర్గాల్లో నాయకులు.. ముందుకు రావడం లేదు. ఈ కనీస విషయాన్ని వారు గుర్తించలేక పోతున్నారు. అన్నీ చంద్రబాబు చూసుకుంటారులే.. అని భావిస్తున్నారా? లేక ఆయన చెబితే తప్ప.. కదల కూడదని అనుకుంటున్నారో తెలియడం లేదు. ఉమ్మడి కృష్ణా నుంచి అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది నాయకులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటేనే బయటకు వస్తున్నారు. అది కూడా మొక్కుబడిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనిపై అనేక సందర్భాల్లో చంద్రబాబే హెచ్చరించారు. ఎవరెవరు పనిచేస్తున్నారో.. తనకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలకు కూడా దిగుతానని చెప్పారు. అయినప్పటికీ.. నాయకులు ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్న పరిస్థితి పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. పార్టీ విజయం దక్కించుకుంటే.. భారీ సంఖ్యలో పదవులు.. నామినేటెడ్ పోస్టులు.. ఇలా అనేకం ఉన్నాయి. అవన్నీ.. చంద్రబాబు ఒక్కరే.. అనుభవించరు. నారా లోకేష్ ఒక్కరే ఆయా పదవులు తీసుకోరు. ఈ విషయాన్ని కూడా నాయకులు గ్రహించలేక పోతే ఎలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.