తెలుగుదేశం వాళ్లు అవునన్నా కాదన్నా… కుప్పం నియోజకవర్గంలో భారీ దెబ్బ పడింది. పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో వాస్తవానికి ఇతర పార్టీలకు 10 శాతం ఓట్లు మించకూడదు. అలాంటిది మెజారిటీ సీట్లు వైసీపీ గెలిచిన మాట వాస్తవమే. ఇతర చోట్ల వైసీపీకి ఇచ్చిన పోటీని తెలుగుదేశం పార్టీ కుప్పంలో ఇవ్వలేకపోయింది.
అయితే, మారుమూల ప్రాంతం అయిన కుప్పం నుంచి ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రి గా మూడు సార్లు ఎన్నికవడమే కాకుండా, ప్రపంచ ప్రముఖుల చేత జేజేలు కొట్టించుకున్నారు. రచ్చ గెలిచి ఇంట గెలవడంలో విఫలం అయ్యారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని తెలుగుదేశం ఇతర ప్రాంత నేతలు తలపట్టుకుంటున్నారు.
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయితీలు ఉన్నాయి. వీటిల్లోనాలుగు పంచాయితీలు మినహా మిగిలిన 89 చోట్ల ఎన్నికలు జరిగాయి. తాజాగా వెలువడిన 82 పంచాయితీల ఫలితాలు చూస్తే.. 70చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించగా.. 12 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారంటున్నారు. ఈ లెక్కల్లో కొంచెం తేడా ఉన్నా… వైసీపీ అధికంగా గెలచుకున్న మాట వాస్తవమే. అయితే… దీనికి కారణం చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రం గురించి పట్టించుకుంటూ… సొంత ఊరిని సరిగా పట్టించుకోలేదన్న అపవాదు ఉంది.
ముఖ్యంగా స్థానిక నాయకత్వం చాలా వీక్ అని అందువల్లే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన మూడున్నర దశాబ్దాల్లో నియోజకవర్గంలో టీడీపీది ఏకఛత్రాధిపత్యంగా ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబే గెలిచేది. అయితే, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేకపోవడంతో నాయకత్వ లోపం ఏర్పడింది. ఇక చంద్రబాబు ఎంత సేపు సమాజం, అభివృద్ధి అంటూ పోతారే గానీ సొంతూరు, సొంత నియోజకవర్గం అని ఆలోచించకపోవడం వల్ల బాగా నష్టం జరుగుతోందంటున్నారు.
ఇక సొంత నియోజకవర్గం కరడుగట్టిన తెలుగుదేశం అభిప్రాయాన్ని ఈ కింద ట్వీట్లో చూడొచ్చు. కొంచెం బాబు దీని మీద దృష్టిపెడితే మంచిది.