కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్నలారీని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడడం బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు లోకేష్ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను తక్షణ సాయం అందించి, అన్ని రకాలుగా ఆదుకోవాలని, ఈ తరహా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.