టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. రామతీర్థం వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌లోని కేవలం చంద్రబాబు కాన్వాయ్కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా పోలీసులు లారీలు అడ్డుపెట్టారు. దీంతో, పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు అడ్డగించడంతో మాజీ మంత్రి చినరాజప్ప ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత నడుచుకుంటూ వెళ్లి, ఆటోలో రామతీర్థానికి బయలుదేరారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతమిచ్చారు. విశాఖ నుంచి రామతీర్థం బయలుదేరిన చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయనగరం జిల్లాలో పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేయగా..మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబుతో కలిసి తమని వెళ్లనివ్వకపోవడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.