టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ దాడుల వ్యవహారం, ఏపీలో దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ప్రభుత్వ ఉగ్రవాదంపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు…రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. భేటీ అనంతరం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన నడుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని జగన్ పై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని, నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు మరింత దిగజారకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చంద్రబాబు చెప్పారు.
ఏపీలో మీడియాను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందని, దుర్మార్గమైన ఆలోచనతోనే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఉన్మాది పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడుల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని, డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని, వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని, డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులున్నాయని అన్నారు. చివరికి.. ఎన్నికల సంఘం.. ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా చేశారని చెప్పారు.
2430 జీవోతో.. మీడియాను కూడా నియంత్రించారని మండిపడ్డారు. రెండేళ్లలో వైసీపీ పాలన తీరుపై పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నామని అన్నారు. ఇన్ని అరాచకాలు.. పోలీసుల సహకారంతోనే చేశారని ఆరోపించారు. తాము రాజకీయ, ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతికి విన్నవించామని చంద్రబాబు అన్నారు.