టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వయసు గురించి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పదే పదే ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముసలాయన…ఆయనకు వయసైపోయింది అంటూ జగన్ సెటైర్లు వేస్తున్న వైనంపై చంద్రబాబు తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. తన మాదిరిగా మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ళ మీద తాను నిలబడగలడా ఈ జగన్? అంటూ బనగానపల్లెలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.
‘ పిల్లకాకి అడుగుతున్నాడు నేనేం చేశాను అని…నా వయసు గురించి మాట్లాడుతున్నాడు…జగన్ రా…నా మాదిరిగా రెండు రోజులు మంచి మధ్యాహ్నం రెండు మూడు మీటింగ్ లు అడ్రస్ చెయ్యి..నా వయసు గురించి నేను చేసిన పనుల గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా’ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. హైటెక్ సిటీ మొదలు కియా మోటర్స్ వరకు తన ముద్ర కనిపిస్తుందని, జగన్ ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు.
తనను ముసలోడు అంటున్నాడని, తనకు వయసైపోతున్న మాట వాస్తవమే అయినా…ప్రజాసేవ చేయాలన్న సంకల్పంలో మాత్రం తాను జగన్ కంటే ఎక్కువేనని చెప్పారు. వయసుతోపాటు తనకు వచ్చిన అనుభవం జగన్ వయసు కన్నా ఎక్కువని చురకలంటించారు. తన వయసు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబుకు వయసైపోయిందని, ముసలాయన అని జగన్ పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, జగన్ వ్యూహం పసిగట్టిన చంద్రబాబు…జగన్ కు ఛాలెంజ్ విసిరి కౌంటర్ ఇచ్చారు. జగన్ దెబ్బకు అతలాకుతలమవుతున్న ఏపీకి తన అనుభవం కావాలని అన్నారు. జగన్ మేమంతా సిద్ధం సభలు సాయంత్రం పూట జరుగుతున్నాయని, ఎండలో తిరగలేకే జగన్ ఆ రకంగా సభలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.