టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్కు సవాల్ రువ్వారు. దమ్ముంటే చర్చకురా.. జగన్ రెడ్డీ అని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత, సీఎం జగన్.. తాజాగా అనంతపురం జిల్లాలోని రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ఏపీలో చంద్రబాబు పాల నను ఆయన విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే.. ఏపథకమైనా గుర్తుకు వస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కొందరికే అనుకూలంగా ఉందన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకు కుర్చీలు మడత పెట్టారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మరింతగా చంద్రబాబుకు కుర్చీలు మడత పెట్టేందుకు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపు నిచ్చారు.
అయితే.. జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆదివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత.. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సుదీర్ఘ ప్రకటనలో జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ‘‘జగన్తో చర్చకు నేను సిద్ధం. నాతో చర్చకు వచ్చే దమ్ముందా? బూటకపు ప్రసంగాలు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం పాలన ఎవరిదో చర్చిద్దాం. ఎవరి పాలన స్వర్ణయుగమో.. ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దాం. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్.. సంక్షేమం గురించి చెప్పడమా?“ అని చంద్రబాబు నిలదీశారు.
అంతేకాదు, “రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కాదు.. విధ్వంసం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్కు చివరి ఛాన్స్. మీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టేందుకు జనం కసితో ఉన్నారు. ఓటమి భయంతో బదిలీలంటూ 77 మందిని జగన్ మడత పెట్టారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడతారు’’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు పేరు చెబితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏయే సంక్షేమ పథకాలు అమలు చేశామో గుర్తుకు వస్తాయన్నారు. ఇన్నోవా కార్లు, కులవృత్తులకు చేతి పనిముట్లు, తోఫాలు, కానుకలు, రుణాలు.. ఇలా అనేకం గుర్తుకు వస్తాయని చెప్పారు.
జగన్ పేరు చెబితే.. దోపిడీ, నేరాలు, ఇసుక, మద్యం, గ్రావెల్ కుంభకోణాలు.. ఇలా అనేక గుర్తుకు వస్తాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను ఏమీ చేయలేక పోయిన.. అనేక అంశాలు గుర్తుకు వస్తాయని అన్నారు. ఎక్కడికి వెళ్లినా.. అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అన్ని విషయాలపైనా తాను చర్చించేందుకు సిద్ధమని, జగన్కు దమ్ముంటే చర్చకు రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీని ఢీకొట్టలేరని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ట్రెమండస్ విక్టరీ టీడీపీ సొంతమని అందుకే జగన్ అబద్ధాలతో రెచ్చిపోతున్నాడని వ్యాఖ్యానించారు.
OPEN CHALLENGE!
సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి….ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం… pic.twitter.com/5WpMK2oiHz
— N Chandrababu Naidu (@ncbn) February 19, 2024