ఏపీ మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `పులివెందుల ఎమ్మెల్యే` అంటూ జగన్ పేరు ఎత్తకుండానే ఆయన కామెంట్లు చేశారు. ఇటీవల నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే, మాచర్ల వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన చంద్రబాబును ఉద్దేశించి `హెచ్చరికలు` జారీ చేస్తున్నానని చెప్పారు. తాజాగా చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. “పులివెందుల ఎమ్మెల్యే మిమ్మల్ని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు“ అంటూ.. కొందరు ప్రస్తావించారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ..“పులివెందుల ఎమ్మెల్యే వంటివారు వ్యవస్థలకే మచ్చ. ఎక్కడెక్కడో సొమ్ములు కొట్టేసి.. విర్రవీగుతున్నారు. ఇలాంటి వారిని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే.. 500, 200 నోట్లను కూడా రద్దు చేయాలని నేను కోరుతున్నారు. ఈ విషయాన్ని బ్యాంకర్ల సమావేశంలోనూ చెప్పా. దీనిని ఎంత తొందరగా చేస్తే.. అంత త్వరగా మంచి జరుగుతుంది“ అని చంద్రబాబు అన్నారు. కొట్టేసిన సొమ్ముతో ప్రలోభాలకు గురి చేస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు వ్యవస్థకే సవాలుగా మారారని చంద్రబాబు చెప్పారు.
“కరడుకట్టిన ఆర్థిక నేరస్థులు చాలా మంది ఉన్నారు. ప్రజల సొమ్మును లూటీ చేసి… ఆ డబ్బుతో ఎక్కడికక్కడ ప్రలోభాలు చేస్తూ వ్యవస్థకే సవాలుగా మారారు. గత ఐదేళ్లలో భారీగా మూటలు కట్టిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనగలిగే సామర్థ్యం వారికి వచ్చింది. అందుకే బ్యాంకర్ల సమావేశంలో రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయమని చెప్పా. నగదు చెలామణి తగ్గించేసి.. ఎక్కడికక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండేలా చేయాలని కోరా. అవన్నీ లాంగ్ టర్మ్ లో ఫలితాలు చూపిస్తాయి“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎన్ని బెదిరింపులు చేసినా.. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. ఎన్ని అవకతవకలకు పాల్పడినా వారిని వదిలి పెట్టబోమని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి నేరస్థులను ఎక్కడ ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం పట్టుకుని తీరుతుందని.. చట్టం ప్రకారం శిక్షిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ విషయం అస్సలు సహించేది లేదన్నారు. “మేం ఎవరికీ భయపడం. రాజకీయ ముసుగులో బెదిరించాలని చూసేవారిని అసలు వదిలి పెట్టేది కూడా లేదు. అవసరమైతే.. తన్ని తరిమేస్తాం. మీరేం బెంగపెట్టుకోవద్దు(ప్రజలు, మీడియా)“ అని చంద్రబాబు తెలిపారు.