మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు…లేదంటే ముందస్తు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ 45 రోజులపాటు రాష్ట్రం నలువైపులా కలియదిరగనున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు…జగన్ పాలనపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. దోచుకోవడం దాచుకోవడమే జగన్ పని అని, తాను ఐటీ రంగాన్ని డెవలప్ చేసి యువతకు ఉద్యోగాలిస్తే..జగన్ మాత్రం వాలంటీర్ల ఉద్యోగాలిచ్చి శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
‘‘జగన్ అన్యాయాలు, అక్రమాలపై ఎంతసేపు నేనే పోరాడాలా?… దోపిడీపై ప్రజలు కూడా పోరాడాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన సభ సందర్భంగా కుర్రాళ్ల కేరింతలు ఎంతో సంతోషాన్నిచ్చాయని, తాను ఈరోజు టీనేజ్ పిల్లాడిలా, 13 ఏళ్ల కుర్రాడిలా ఆలోచిస్తున్నానని అన్నారు. 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో దానిని అందించే బాధ్యత నాది. అని చంద్రబాబు భరోసానిచ్చారు. విజన్ 2020 చేసి చూపించానని, ఇపుడు విజన్ 2047 కూడా చేసి చూపిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. సంపద సృష్టించడం తనకు తెలుసని, తన హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని, 6 లక్షల ఉద్యోగాలు కల్పించానని, డీఎస్సీ ద్వారా 17 వేల ఉద్యోగాలు భర్తీ చేశానని అన్నారు.
వ్యవసాయాన్ని ఆధునికీకరించుకుంటూ, టెక్నాలజీని, కంప్యూటర్ మౌస్ లను ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి కంపెనీలను ఇళ్ల దగ్గరకు తీసుకువస్తానని, అదే వర్క్ ఫ్రం హోమ్ అని అన్నారు. అమెరికాలో కంపెనీకి అనంతపురంలోని ఇంటి నుంచే పనిచేసేలా యువతకు అవకాశాన్ని కల్పిస్తానని ష్యూరిటీనిచ్చారు. ఈ మాట ఇంటింటికీ చెప్పాలని, మీ భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ అని చంద్రబాబు అన్నారు.
అనంతపురం జిల్లాను హార్టీకల్చర్ హబ్ గా మారుస్తానని, పండ్ల తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానని, రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని, రాష్ట్రంలో రైతును రాజుగా చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ పది రూపాయలిచచి వంద దోచుకుంటున్నాడని, కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.87 అయితే, ఏపీలో రూ.98 అని దుయ్యబట్టారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఆటోలు గుల్లవుతున్నాయని, గతుకుల రోడ్లపై మార్గమధ్యంలోనే డెలివరీలు అయ్యే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు.