ఏపీలో వైసీపీ పాలనను టీడీపీ ఎండగడుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అపరిపక్వ నిర్ణయాలు, నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ సారి పార్టీ పరంగా ఎన్నికలు జరగబోతుండడంతో వీటిని తెలుగు తమ్ముళ్లు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇటువంటి నేపథ్యంలో కలిసికట్టుగా ముందుకు పోయి బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టాల్సిన కొందరు టీడీపీ నేతలు…అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడలో కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాల మధ్య తలెత్తిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారానికి చెక్ పెట్టారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ రెండు వర్గాల మధ్య వచ్చిన విభేదాలకు చంద్రబాబు జోక్యంతో ఫుల్స్టాప్ పడింది.
ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు….ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్మీరాలతో కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. విపక్షంలో ఉన్నపుడు ఈ కీచులాటలు మంచిది కాదని, వివాదాలు పక్కనబెట్టి కలిసి పని చేయాలనే హితవు పలికారు. దీంతో, ఇరు వర్గాలు మెత్తబడి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి.
అంతకుముందు, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు…. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును రంగంలోకి దించారు. బుద్దా వెంకన్న, నాగుల్మీరాలతో చర్చించిన అచ్చెన్న…. ఆ తర్వాత చంద్రబాబుతో మాట్లాడారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని, కాబట్టి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇద్దామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వీఎంసీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని, ఇక మీదట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు.
ఎంపీ కేశినేని నానీతో కలిసి ముందుకు సాగడానికి ఇబ్బందుల్లేవని, పార్టీ అధినేత మాటే శిరోధార్యమని, టీడీపీలో ఎవరు ఎప్పుడు గెలిచినా చంద్రబాబు వల్లేనని, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పేర్కొన్నారు. టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక కుటుంబంలో ఉండే సమస్యల్లాంటివేనని, వాటిని సర్దుబాటు చేసుకుంటామని కేశినేని నాని చెప్పారు. దీంతో, ఈ వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లయింది.