చంద్రబాబు దిశానిర్దేశంలో ఉమ్మడి రాష్ట్రం బాగుంది.. ఆ మాటకు వస్తే తత్ సంబంధిత పరిణామాలూ బాగున్నాయి.. అప్పుడయితే ఇన్ని ఉచితాలు లేవు.. సంక్షేమ పథకాలు ఉన్నా ఇన్ని రంగాలలో తడబాట్లు మరియు పొరపాట్లూ లేవు… కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిన కారణంగా చంద్రబాబు తిరుగులేని నేతగా మరోసారి ఆవిర్భవించేందుకు యుద్ధం చేస్తున్నారు… ఏడు పదుల వయసులో అలుపెరుగక శ్రమిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 20 ఆయన బర్త్ డే.. డియర్ సర్ హ్యాపీ బర్త్ డే ..
నాయకులు ఎన్నో అనుభవాలను పోగేసుకుని ఉంటారు. మంచి నాయకుడిగా రాణించిన క్రమాన చంద్రబాబు కూడా అదేవిధంగా వైఫల్యాలను దాటుకుని వచ్చి తన అనుభవంతో ఆ రోజు తన కలల నగరి హైటెక్ సిటీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. టెక్ హబ్ గా హైద్రాబాద్ ను తీర్చి దిద్ది వారికో కానుక ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రాలో స్వర్ణాంధ్రను సాకారం చేసుకునే క్రమంలో కృషి చేశారు.
ఆయన తీసుకువచ్చిన జన్మభూమి కార్యక్రమం తరువాత కాలంలోనూ పేరు మార్చుకుని అమలుకు నోచుకుంటూనే ఉంది. ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమంలో వాడవాడకూ అధికారులు వచ్చేలా చేశారు. నెలకో రోజు ఫైళ్ల క్లియరెన్స్ కు కేటాయించేలా చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రాలో ఆయన అధికారులను పరుగులు పెట్టించారు.
విద్యుత్ రంగం పరంగా ఆయన కొన్ని క్రియాశీలక నిర్ణయాలు విధాన పరంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేసి కొన్ని విమర్శలకూ గురయ్యారు. వాటిని వాటికి సంబంధించిన కొన్ని పరిణామాలనూ మినహాయిస్తే ఏ విధంగా చూసుకున్నా ఉమ్మడి ఆంధ్రకు ఆయన చేసిన మేలు ఎక్కువ.
ఆ లెక్కన చూసుకుంటే హైద్రాబాదీలు ఎంతో అదృష్టవంతులు. కానీ అవశేషాంధ్రకు ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి ఆయన కృషి చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకునేలోగానే కొన్ని చేదు అనుభవాలు ఆయనకు మిగిలాయి. ఆ విధంగా ఆయన విషయమై ఓటరు తప్పు చేశాడు అని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులు తమ గోడు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఏదేమయినప్పటికీ మళ్లీ ఆయనను సీఎంను చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తామని చెబుతున్నారు.
కొన్ని తప్పిదాలు చేసినా కూడా చంద్రబాబు అంటే ఇష్టపడే వారు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. కొన్ని తప్పిదాలు ఉన్నా కూడా ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గెలుపు ఓటముల్లో కొందరు నాయకులు దూకుడుగా ఉంటారు .. కొందరు దాగుడుమూతలు ఆడుతారు. కానీ ఆయన మాత్రం కేవలం పార్టీని నిలబెట్టే క్రమంలో కృషి చేశారు. కృషి చేస్తూనే ఉన్నారు కూడా!
ఆ విధంగా ఆయనకు ఇవాళ అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణ లో ఫక్తు ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే కొన్ని కలల సాకారానికి చంద్రబాబు నాయుడే స్ఫూర్తి. ఇవాళ వైసీపీలో ఎదిగిన లేదా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతున్న నాయకులంతా టీడీపీ పాఠశాలలో ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవారే అన్నది కాదనలేని వాస్తవం.