భారత రాజ్యాంగం చాలా గొప్పదని, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీ సీఎం జగన్ చెప్పారు. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగమని, 72 ఏళ్లుగా మన రాజ్యాంగం అణగారిన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసంగించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం అందించాలన్న ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం మనదని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనకు అందించారని, దానిని అమలు చేసేందుకు ప్రయత్నిద్దామని అన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు ఒక బహిరంగలేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని ఆయన వెల్లడించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుందని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుందని అంబేడ్కర్ అన్న మాటలను చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని అంబేడ్కర్ ఊహించి చెప్పి ఉంటారని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు.