ఏపీలో వాలంటీర్ల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో తాజాగా విమర్శలు గుప్పించారు. వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదని, ప్రజలకు సేవ చేస్తే తప్పుబట్టబోమని అన్నారు. సైకో జగన్ చెప్పిన పనులు చేయొద్దని, పార్టీ పనులు చేస్తే ఆ ఆడబిడ్డలు వదిలిపెట్టరని, కచ్చితంగా నిలదీస్తారని వార్నింగ్ ఇచ్చారు.
అదిస్తాం, ఇదిస్తాం అంటూ వాలంటీర్లు ఇళ్ళలోకి వస్తున్నారని, వీళ్లెవరండీ ఇంట్లోకి రావడానికి? అని చంద్రబాబు నిలదీశారు. అంతే కాకుండా మీ ఆయనకు వేరే ఎవరితోనైనా సంబంధాలున్నాయా? మీకు ఏమైనా అనుమానం ఉందా? అనే ప్రశ్నలు అడగడం. కొంపలు కూల్చే వ్యవహారమే కదా అని నిలదీశారు. మగవాళ్ల దగ్గరకెళ్లి మీ ఆడవాళ్లేమైనా బయట తిరుగుతున్నారా అని ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు.
ఈ విషయాలతో మీకేం సంబంధం? చెప్పుతో కొట్టేవాడు లేకపోతే… ఏంటివన్నీ జగన్ మోహన్ రెడ్డీ? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వ్యక్తిగత గోప్యత ఉండాలా, వద్దా? మన విషయాలు వీళ్లకెందుకు? ఏ కుటుంబం ఎలా ఉంటే మీకెందుకు? దానిపై మళ్లీ సంతకం కూడా పెట్టాలంట!
అని నిప్పులు చెరిగారు.
మరోవైపు, టీడీపీ పాలనతోనే రాష్ట్రంలో మహిళా సంక్షేమం సాధ్యమైందని, మహిళా సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు… తెలుగుదేశం ఆవిర్భావం తరవాత అని చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో మహాశక్తి పథకాలపై నిర్వహించిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. మహాశక్తి చైతన్య రథయాత్రను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలేనని, పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని అన్నారు.