వరద బాధితుల కోసం కేంద్రం ఇస్తున్న సాయంపై కొందరు ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నా రని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరదలపై తాము శనివారమే ప్రాథమిక నివేదిక పంపించామని.. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇదేసమయంలో కేంద్రం నుంచి జాతీయ విపత్తు నిధుల కింద కొంత సొమ్మును రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే.. ఇంతలోనే కేంద్రం ఏదో ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారని.. అది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. నిరాధార ప్రచారాలపై చర్యలు ఉంటాయన్నారు.
అసలేంటీ వివాదం?
బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి శుక్రవారం.. కేంద్రం రూ.3300 కోట్లు ఇచ్చిందని ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే.. ఇది జోరుగా వైరల్ అయింది. ఆ వెంటనే చంద్రబాబు ఖండించారు. కానీ, పురందేశ్వరి మాత్రం ఈ పోస్టును తొలగించలేదు. దీంతో ప్రతిపక్షం నేతలు.. కేంద్రం నిధులు ఇచ్చిందని పేర్కొంటూ.. కామెంట్లు చేస్తున్నారు. కేంద్రం కూడా.. ఈ విషయంలో ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాది విపత్తు సహాయ నిధి కింద 3400 కోట్ల రూపాయలను ఏపీకి ఇచ్చామన్నారు.
ఆ సొమ్ములు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని చెబుతోంది. ఇదే విషయాన్ని తాజాగా ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి చౌహాన్ కూడా చెప్పారు. ప్రస్తుతం దీని నుంచి ఖర్చు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అటు పురందేశ్వరి పోస్టు.. ఇటు చంద్రబాబు హెచ్చరికలు .. ఏం జరిగిందనే విషయంపై సస్పెన్స్ ఏర్పడేలా చేశాయి.