పార్టీ నేతలపై చంద్రబాబునాయుడు చాలా సీరియస్ అయ్యారు. భవిష్యత్తుకు గ్యారెంటీ అని రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మొదటివిడత మ్యానిఫెస్టో ప్రచారం కోసం ఆరు బస్సులు బయలుదేరాయి. 125 నియోజకవర్గాల్లో 30 రోజుల పాటు మినీ మ్యానిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ఐదు బస్సులు బయలుదేరాయి. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో చంద్రబాబు తమ్ముళ్ళపైన బాగా సీరియస్ అయ్యారు. రాబోయే 151 రోజులు నేతలంతా జనాల్లోనే ఉండక తప్పదని హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లోను టీడీపీ గెలవాలంటే అందరు సమిష్టిగా కష్టపడక తప్పదని చెప్పారు. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైనవి కాబట్టి ఎవరికి వాళ్ళుగా బాధ్యతగా వ్యవహరించాల్సిందే అన్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేని వారిని, పార్టీకి అంకితభావంతో పనిచేయని వారిని ఉపక్షించేది లేదన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బాధ్యతలనుండి తప్పుకోవాలని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ అరాచకాలపై జనాలంతా భయపడుతున్నారన్నారు. జనాలంతా భయపడుతున్నపుడు ప్రతిపక్షాలు ప్రజలను కలిసి ధైర్యం చెప్సాలన్నారు. అందుకనే రాబోయే 151 రోజులు పార్టీకి ఎంత కీలకమైనవనే విషయాన్ని నొక్కి చెప్పాల్సొస్తోందని చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఇచ్చిన బాద్యతలను నెరవేర్చే విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీలో ఇచ్చిన 6 హామీలను చంద్రబాబు సూపర్ సిక్స్ గా అభివర్ణించారు. సూపర్ సిక్స్ అనే బ్రహ్మాండమైన ఆయుధాన్ని పార్టీ నేతలకు ఇచ్చిందని చెప్పారు.
అంతటి బలమైన ఆయుధాన్ని పార్టీ తమ్ముళ్ళకు అందించినపుడు ఇక పోరాటాలు చేయాల్సింది నేతలే అని గుర్తుచేశారు. కాబట్టి ప్రజల్లోనే ఉంటు పోరాటాలు చేసేవాళ్ళనే పార్టీ నాయకత్వం కూడా గుర్తిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. అంటే ఇపుడు మొదలయ్యే పోరాటంలో పాల్గొనే నేతలకు భవిష్యత్తులో టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. మరిప్పటికే ప్రకటించిన కొంతమంది అభ్యర్ధుల విషయం ఏమిటి ? అనే చర్చ మొదలైంది. అయితే వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో తిరగాల్సిందే అని అభ్యర్ధిగా ప్రకటించేశారు కాబట్టి తమకేమీ ఇబ్బందులు ఉండదని అనుకుంటే మొదటికే నష్టం జరుగుతుందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.