విజయనగరం జిల్లా రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. బోడికొండపై కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన వ్యవహారంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజుకు ఘోర అవమానం జరగడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శంకుస్థాపన విషయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తనను వెల్లంపల్లి కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఆయన అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన, పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు వీధి రౌడీల్లా దాడికి తెగించారని ఫైర్ అయ్యారు. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు…రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని దుయ్యబట్టారు.
ఆలయ ధర్మకర్తలకు కొన్ని హక్కులు అనాదిగా వస్తున్నాయని, ఆ ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని నిప్పులు చెరిగారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు సమాచారం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల కోసం, హిందూ ధర్మం కోసం వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా..? అని దుయ్యబట్టారు.
కనీస ప్రోటోకాల్ పాటించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.? అని ధ్వజమెత్తారు. అశోక్ గజపతిరాజుపై జగన్ కక్షగట్టారని, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళమిస్తే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరి చిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.