మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేసింది. మునుపెన్నడూ లేనంత తక్కువ ఓటింగ్ నమోదు అయినపుడే ఫలితాలు వైకాపాకు అనుకూలం అనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఊహించినదానికంటే ఎక్కువ చోట్ల వైకాపా గెలిచింది.
ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఫలితాలు నిరాశపరిచాయి గాని కార్యకర్తల పోరాటం మాత్రం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
ఆయన ఏమన్నారో…
“తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే.”
మీ నారా చంద్రబాబు నాయుడు
ఇక ఫలితాలపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హుందాగా స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ వారికి మరింత దగ్గరయ్యేందుకు ఇంకా కష్టపడదాం అని శ్రేణులకు పిలుపునిచ్చారు.
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పుని గౌరవిస్తున్నాం.ఎన్నికల కోసం రాత్రనక పగలనక శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులకు అభినందనలు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకాన్ని,@ysjagan అధికారమదాన్ని ఎదిరించి నిలిచి గెలిచినవారికి,పోరాడి ఓడిన వారికి..అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలే జరపకూడదనుకున్న జగన్రెడ్డి సర్కారు అప్రజాస్వామిక వైఖరిని ప్రజల ముందు ఉంచడంలో మనం సక్సెస్ అయ్యాం.
ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరించినా,నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా..అదరక బెదరక తెలుగుదేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారు.వైసీపీకి ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ చెందొద్దు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా… ప్రజాసమస్యలపై తెలుగుదేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.ఆ పోరాటంలో క్రమశిక్షణ,అంకితభావం కలిగిన సైనికులుగా పనిచేద్దాం.ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషిచేద్దాం
ఇది నారా లోకేష్ స్పందన.