టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేసినేని నాని కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని కేశినేని నాని గతంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ క్రమంలోనే నాని సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తన అన్న స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే నాని వ్యతిరేక వర్గాన్ని చిన్ని కలిశారని, దాంతోపాటు తన కారుపై కేశినేని చిన్ని ఎంపీ స్టిక్కర్ వేసుకోవడంపై నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు, నానికి మధ్య గ్యాప్ వచ్చిందని పుకార్లు వినిపించాయి. ఇక, ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికేందుకు కేసినేని నాని నిరాకరించినట్లుగా వచ్చిన వీడియో సంచలనం రేపింది.
చంద్రబాబు, నానిల మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే తాజాగా ఈ పుకార్లను పటాపంచలు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో నాని మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు నాని తదితర టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో నాని ముచ్చటిస్తున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో, చంద్రబాబు నానిల మధ్య గ్యాప్ లేదని, ఇదంతా ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అయితే, ‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కాగా, పార్టీలో తాను అసంతృప్తిగా లేనని స్వయంగా కేసినేని నాని మీడియాకు వెల్లడించారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని తాను ఎంపీగా ఉన్నా, లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదని కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని అన్నారు. ఇక తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో తాను మాత్రమే ప్రయాణిస్తానని, అందులో తన కూతుర్ని కూడా తిరగనివ్వనని నాని చెప్పారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని అది మహిళల సంబంధించినదని నాని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిపై ఇటువంటి ఆరోపణలు వస్తే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.