తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు రాష్ట్రంలోని ముస్లిం నాయకులు.. టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా హాజరై.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తన దైన శైలిలో హైదరాబాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేసి ఉండక పోతే.. ఈ రేంజ్లో ప్రజలకు సదుపాయాలు ఉండేవి కాదని వ్యాఖ్యానించారు.
హిందూ-ముస్లిం భాయిభాయి అనేదే తెలుగుదేశం సూత్రమని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుందని.. కర్ఫ్యూ నగరాన్ని కొవిడ్ టీకా అందించే నగరంగా మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంతోనే పాతబస్తీ అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుందని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని, ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది టీడీపీ హయాంలోనేనని పేర్కొన్నారు.
“హిందూ-ముస్లిం భాయిభాయి అన్నదే టీడీపీ సూత్రం. టీడీపీకి ముందు, తరువాత అనేలా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుంది. కర్ఫ్యూ నగరాన్ని కొవిడ్ టీకా అందించే నగరంగా మార్చింది టీడీపీ. శంషాబాద్ విమానాశ్రయంతో పాతబస్తీ అభివృద్ధి జరిగింది. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది టీడీపీ“ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇఫ్తార్ విందులో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.