2019 ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడింది? అన్న అంశంపై ఎన్నికల ఫలితాలు వెలువడి.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికి ఈ చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. ఎవరెన్ని అంటున్నా.. వారి మాటల్ని ఖాతరు చేయకుండా పసుపు కుంకమ పేరుతో ఎన్నికల తాయిలం ఇచ్చేందుకు వెనుకాడలేదు.
తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు.. తాను ఇస్తానన్న తాయిలాలు వర్కువుట్ అవుతాయని.. తమ విజయం ఖాయమన్న ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. అలాంటి వేళ.. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగిపోయేలా ఉండటం తెలిసిందే. ఎప్పుడూ లేనంత దారుణమైన రీతిలో ఓటమి పాలు కావటం తెలిసిందే.
ఓవైపు అమరావతి.. మరోవైపు పారిశ్రామికంగా దూసుకెళుతూ.. ఇంకోవైపు విపత్తులు విరుచుకుపడినప్పటికి విశాఖ లాంటి నగరాన్ని ఎంత త్వరగా దాని నుంచి బయటపడేశారన్నది తెలిసిందే. అయినప్పటికీ చంద్రబాబును ఏపీ ప్రజలు ఎందుకు రిజెక్టు చేశారన్నది ప్రశ్నే. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో వాదనను వినిపిస్తారు. మరి.. ఈ ఓటమితో దారుణ ఇబ్బందులకు గురవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏమంటారు? ఆయన ఏ విధంగా విశ్లేషిస్తారు అన్న దానికి తాజాగా సమాధానం లభించింది.
మీడియాతో మాట్లాడిన సందర్భంగా 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందటానికి తాము చేసిన పనుల్ని చెప్పుకోవటంలో దొర్లిన తప్పు అన్న వాదనను తీవ్రంగా తప్పు పట్టారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోవడం వల్లే ఓడిందన్నది నిజం కాదన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో కియా కార్ల ఫ్యాక్టరీ కళ్ల ముందు కనిపిస్తున్నా.. అక్కడ కూడా తాము ఓడినట్లు పేర్కొన్నారు.
కియా పరిశ్రమకు ముందు అక్కడ ఎకరం రూ.లక్ష ఉంటే.. పరిశ్రమ వచ్చిన తర్వాత అది కాస్తా రూ.10లక్షలు అయ్యిందని.. అయినప్పటికీ వైసీపీకి ఓట్లు వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ఇంకా ఏవో అద్భుతాలు జరుగుతాయని ప్రజలు ఆశపడి ఓట్లు వేసి ఉంటారన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో 90 శాతం సబ్సిడీతో రైతులు బిందు సేద్యం పరికరాలు అమర్చుకోవటానికి సాయం చేసిందని.. ఇప్పుడు పైసా సాయం లేదన్నారు. ప్రజలకు ఇచ్చే దాని కంటే కూడా గుంజేదే ఎక్కువన్న విషయాన్ని ఓటీఎస్ పథకం ద్వారా ప్రజలకు అర్థమైూందన్నారు.
ఇప్పటికి పార్టీ నాయకులు కదలకపోతే.. వారిని తామే వదులుకుంటామన్న మాట చంద్రబాబు నోటి నుంచి రావటం గమనార్హం. మొత్తానికి తమ దారుణ ఓటమికి కారణాల్ని వెతికే విషయంలో చంద్రబాబు ఇప్పటికి శోధన చేస్తున్నారన్న విషయం ఆయన తాజా మాటల్ని వింటే కలుగుతుందని చెప్పాలి.