ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర అసెంబ్లీలోకి ప్రవేశ పెట్టిన దిశ బిల్లును ఆమోదించటమే కాదు.. కేంద్రానికి పంపిన వైనం తెలిసిందే. కేంద్ర సర్కారు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చట్టంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఏపీ సర్కారు పంపిన బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి పంపింది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లులో అనేక లోపాలు ఉన్నట్లుగా కేంద్రం అభిప్రాయపడుతోంది.
పలు కొర్రీలతో పాటు.. కొన్ని సవరణలుసైతంప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ శివారులో దిశపై జరిగిన ఘోర హత్యాచార ఉదంతం నేపథ్యంలో తెలంగాణ కంటే ముందుగా ఏపీలో దిశ చట్టం పేరుతో బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి.. దాన్ని ఆమోదించటం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మహిళలు.. పిల్లలపై జరిగే దారుణమైన హత్యాచార ఘటనల్లో నేరం చేసిన 21 రోజుల్లోనే శిక్షించేందుకు వీలుగా.. ఈ బిల్లును రూపొందించారు. పదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష.. గరిష్ఠంగా మరణదండన విధించేలా దిశ చట్టం సవరణ బిల్లు 2019ను గత ఏడాది డిసెంబరులో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. నేరం జరిగిన ఏడు దినాల్లో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి.. అభియోగపత్రాల్ని రూపొందించాలని.. పద్నాలుగురోజుల్లో కోర్టులో కేసు విచారణ పూర్తి కావాలని బిల్లులో పేర్కొన్నారు.
శిక్ష పడితే.. హైకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు మూడు నెలల గడువే పేర్కొన్నారు. ఏపీలోని ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును చట్టం చేసేందుకు వీలుగా కేంద్రం అనుమతి కోసం పంపారు. అయితే.. ఇందులోని అంశాలపై పలు కొర్రీలు పెట్టిన కేంద్రం.. తాజాగా ఈ బిల్లును రాష్ట్రానికి వెనక్కి పంపారు. దీంతో.. వారు చేసిన సూచనలకు మేరకు మార్పులు చేసి ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదం పొందిన తర్వాత పంపాల్సి ఉంటుంది. సో.. తాజా పరిణామంతో దిశ బిల్లు మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.