ప్రస్తుతం ఏపీలో రెండే రెండు టాపిక్ లపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు టాపిక్ లలో ఒకటి జగన్ చేస్తున్న అప్పులు…రెండోది బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు జగన్ పడుతున్న తిప్పలు. ఈ రెండు విషయాలపై రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోందనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఇక, కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఖజానాలోటును భర్తీ చేయాలని భావించిన జగన్ కు బ్యాంకర్లు హ్యాండ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఏపీలో కార్పొరేషన్ల ముసుగులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అక్రమాల నిగ్గుతేల్చేందుకు కేంద్రం రెడీ అయింది. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం సంచలన ఆదేశాలు జారీచేసింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఏజీ కార్యాలయ అధికారులు సంప్రదించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎ్సడీసీ) ద్వారా తెచ్చిన రుణాలు, ద్రవ్య నియంత్రణ-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం పరిమితికి మించి చేసిన అప్పుల లెక్కలను అడిగారు. అంతేకాదు, కేంద్రానికి, ఆర్బీఐకి, ఏజీకి తెలియకుండా రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చిన వైనంపైనా వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఏపీ చేసిన అప్పుల లెక్కలను కేంద్రానికి పంపిస్తోంది. అయితే, ఏపీ ఆర్థిక దుస్థితి వ్యవహారంపై మీడియాలో వరుస కథనాలు రావడ, సర్వత్రా చర్చనీయాంశం కావడంతో కేవలం ఏపీ చెప్పిన దానిపై బేస్ కాకుండా కేంద్రం కూడా క్రాస్ చెక్ చేయాలని ఆర్థిక నిపుణులు సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిధుల వాడకం గురించి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ), ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్ (పీఏవో)లను.. కార్పొరేషన్ల అప్పులపై కార్పొరేషన్లు, బ్యాంకులను.. ఇతర అప్పుల గురించి ఆర్బీఐ, నాబార్డును సంప్రదించాలని కేంద్రం డిసైడ్ అయిందట.
ఆల్రెడీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి ప్రభుత్వం సుమారు రూ.32 వేల కోట్ల అప్పు తెచ్చిందని తెలుస్తోంది. ధాన్యం సేకరణ, కొనుగోలు పేరుతో ఈ అప్పును రాష్ట్రం లెక్కల్లో చూపకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆ 32 వేల కోట్లలో 20 వేల కోట్ల అప్పులు రాష్ట్రమే వాడుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దాచిపెడితే బ్యాంకులకు నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి జగన్ అప్పులపై కేంద్రం కొరడా ఝుళిపించిందని, ఈ క్రమంలోనే సంచలన ఆదేశాలు
జారీ చేసిందన్న కామెంట్లు వినబడుతున్నాయి.