కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తీసుకువచ్చిన వ్యాక్సిన్ ప్రక్రియను ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మాత్రమే పరిమితం చేయగా.. త్వరలోనే దేశంలోని రాజకీయ నేతలకు కూడా దీనిని ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తొలి దశలో మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.
అది కూడా హెల్త్ వర్కర్స్కు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇతర దేశాల్లో ప్రధానులు, మంత్రులు, అధ్యక్షులు తొలుత వ్యాక్సిన్ తీసుకున్నారని.. కానీ, మన దగ్గర మాత్రం కేవలం హెల్త్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్‌కే పరిమితం చేయడం వెనుక.. ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ నేతల విషయంలో నిర్ణయం ప్రకటించారు.
వ్యాక్సిన్ ప్రారంభించిన సమయంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే.. రాజకీయ నేతలు ఇప్పుడే కాదని.. వారికి సమయం వచ్చే వరకు వేచి చూడాలని కేంద్రం స్పష్టం చేసింది. నిజానికి రాజకీయ నేతలకు వ్యాక్సిన్ ప్రక్రియను మూడో దశలో పెట్టారు. దీంతో ఈటల సైలెంట్ అయ్యారు. ఇక, ఇప్పుడు విమర్శల నేపథ్యంలో దీనిని రెండో దశకు మార్చారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా వ్యాక్సిన్ విషయంపై ప్రధాని వచ్చే వరకు వేచిచూడాలన్నారు.
కానీ, ఇప్పుడు రెండో దశలో నే రాజకీయ నేతలకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. తొలుత తాను, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటారని తాజా ప్రకటనలో ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ముందుగా రాజకీయ నేతల్లోనూ 50 ఏళ్లు పైబడిన వారే తీసుకోవాలని.. సూచించింది. దీనిని బట్టి.. ఏపీ సీఎం జగన్‌కు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేదు. అయితే.. చంద్రబాబుకు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. రెండో దశలోనే రాజకీయ నేతలకు వ్యాక్సిన్ రెడీ కానుందన్నమాట.