వైరల్ పిక్.. తండ్రి సమాధి ముందు రియల్ హీరో

మహ్మద్ సిరాజ్.. కొన్ని నెలలుగా భారత క్రికెట్ ప్రియుల నోళ్లలో బాగా నానుతున్న పేరు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రెండు మూడు మ్యాచ్‌ల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శనలతో అతడి పేరు మార్మోగింది.

ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా 8 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం సంచలనం రేపింది. ఈ ప్రదర్శన తర్వాత అతను ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ఉండగా తండ్రి చనిపోయినా స్వదేశానికి వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం ద్వారానే. సిరాజ్‌కు లేక లేక భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

తండ్రి కడసారి చూపు కోసం స్వదేశానికి వస్తే.. మళ్లీ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి క్వారంటైన్లో ఉండాలి. టెస్టు సిరీస్‌లో అవకాశం పోయినా పోతుంది. తాను భారత టెస్టు జట్టుకు ఆడాలన్న తండ్రి కలను దృష్టిలో ఉంచుకుని ఆయన కోరిక నెరవేర్చేందుకు కడసారి చూపుకు కూడా దూరంగా ఉండిపోయాడు సిరాజ్.ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు తుది జట్టులో చోటు దక్కకపోయినా.. షమి గాయపడటంతో రెండో టెస్టులో అవకాశం దక్కింది.

ఇక అక్కడి నుంచి సిరాజ్ హవా మొదలైంది. తొలి టెస్టులోనే ఐదు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్ పరాభవం తర్వాత భారత్ బలంగా పుంజుకోవడంలో సిరాజ్‌ది ముఖ్య పాత్రే. తర్వాత సిడ్నీ టెస్టులోనూ అతను రాణించాడు. ఇక సిరాజ్ రియల్ హీరోగా మారింది బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్టులో. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్టే తీసినా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఇక చివరి రోజు భారత్ ఎలా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

మొత్తంగా సిరాజ్ అరంగేట్ర సిరీస్ అతడి కెరీర్‌కు అదిరే ఆరంభాన్నిచ్చింది. అతను అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే సాధించాడు. చనిపోయిన తండ్రికి ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది? ఇక ఆస్ట్రేలియా నుంచి గురువారమే స్వదేశం చేరుకున్న సిరాజ్.. నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లాడు. ఆయనకు నివాళి అర్పించాడు. సంబంధిత పిక్ ఇప్పుడు జనాల హృదయాల్ని తాకుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.