వైసీపీ నేత.. జగన్ కు అత్యంత సన్నిహితుడు.. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి షాక్ తగిలిన వైనం ఒకటి తెర మీదకు వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. జగన్ అక్రమాస్తుల మీద ఆరోపణలు రావటం తెలిసిందే. అనంతరం దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇందూ హౌసింగ్ ప్రాజెక్టు ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో ఇందూ హౌసింగ్ ప్రాజెక్టు కుట్రలో అప్పటి సీఎం వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి కూడా భాగస్వామేనన్న విషయాన్ని సీబీఐ స్పష్టం చేసింది.అర్హత లేని కంపెనీ హౌసింగ్ బోర్డు నుంచి ప్రాజెక్టు పొందినట్లుగా పేర్కొన్నారు.
అలాంటి ప్రాజెక్టులో వైవీ సుబ్బారరెడ్డి వాటా పొందటం కూడా కుట్రలో భాగమైనట్లుగా సీబీఐ వాదనలు వినిపించింది. ఇందూ ప్రాజెక్టుకు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణల్ని.. కేసుల్ని కొట్టేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ ఉదంతానికి సంబంధించి గతంలో హైకోర్టు వాదనలు వినటం.. విషయం.సుప్రీంకోర్టుకు వెళ్లటంతో తీర్పును వాయిదా వేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసును మరోసారి విచారణ చేయాల్సిందిగా సీబీఐ హైకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ శుక్రవారం జరిగింది.
ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేపట్టారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు. ముడుపులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఏమీ జరగలేదని.. ప్రాజెక్టుల్లో జాప్యంతో శ్యాంప్రసాద్ రెడ్డి బయటకు వెళుతుంటే.. వైవీ సుబ్బారరెడ్డి కొన్నారన్నారు. దీనికి సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. ఇందూ ప్రాజెక్టును పొందే అర్హత వైవీ సుబ్బారెడ్డికిచెందిన వసంత ప్రాజెక్ట్స్ కు లేవన్నారు. అలాంటి కంపెనీలో సుబ్బారెడ్డి వాటా పొందటం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.
హౌసింగ్ బోర్డు భాగస్వామ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్స్ లో వైవీ సుబ్బారెడ్డి భాగస్వామి అయ్యాక.. విల్లాలను తన కుటుంబ సభ్యులకు కేటాయించుకోవటం కచ్చితంగా కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. వసంత ప్రాజెక్ట్స్ భాగస్వామి అయ్యాక ఇందూ ప్రాజెక్టుకు గ్రహ నిర్మాణ మండలి కూకట్ పల్లిలో అదనంగా 15 ఎకరాలను కేటాయించిన విషయాన్ని సీబీఐ తన వాదనలో పేర్కొంది. సీబీఐ వాదనలు విన్న అనంతరం కేసు తీర్పును వాయిదా వేస్తూ.. హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తర్వాతి విచారణలో తీర్పు వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.