కేంద్ర దర్యాప్తు సంస్థ…సీబీఐకి కొత్తగా డైరెక్టర్ బాద్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైశ్వాల్.. సంచలన ఆదేశాలు జారీ చేశారు. సీబీఐలో పనిచేసే అధికారులు, సిబ్బంది జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూ వేసుకోవద్దని, గడ్డం కూడా పెంచుకోవద్దని జైస్వాల్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ ఇకపై ఫార్మల్ డ్రెస్ మాత్రమే వేసుకుని రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఇక, సీబీఐలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులు కూడా చీర, సాధారణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని రావడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, అలంకరణలతో కార్యాలయాలకు రావద్దని చెప్పా రు.
దుస్తుల విషయంలో ఈ నిబంధనలను అధికారులు, సిబ్బంది అందరూ కచ్చితంగా పాటించాల్సిందే నని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అయితే.. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ మారాల్సింది రూపంలోనా.. లేక రూలింగ్(కర్తవ్య నిర్వహణ)లోనా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సీబీఐ.. కొన్నేళ్లు గా ఈ సూత్రాన్ని బుట్టదాఖలు చేశాయనే విషయం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థపై నానాటికీ విశ్వాసం సన్నగిల్లుతోందనేది నిపుణుల మాట.
గతంలో డైరెక్టర్గా పనిచేసిన అధికారిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ … తన కేసులకు సంబంధించి కోర్టు కు హాజరు కాకుండా.. వాయిదాలపై వాయిదాలు కోరుతున్నారనే అంశం వెనుక `ఏదో జరిగింద`నే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ ను హుటాహుటిన జైలుకు తరలించడం వెనుక కూడా సీబీఐ పెద్దల పై అనేక ఆరోపణలు వచ్చాయి.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటి ఆరోపణలతో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సీబీఐ పరపతిని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది న్యాయ నిపుణుల మాట.
అత్యంత కీలకమైన ఈ విషయాన్ని పక్కన పెట్టి.. అధికారుల కట్టుబొట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల.. ఎలాంటి ప్రయోజనం ఉంటుందనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి కొత్త డైరెక్టర్ ఏం చేస్తారో చూడాలి.