విదేశీ పర్యటన కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును సీబీఐ కోర్టు ఓకే చేసింది. దీంతో.. వచ్చే నెల మూడు నుంచి 25 వరకు ఆయన యూకేకు వెళ్లేందుకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలిగినట్లైంది. కుమార్తె పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెతో గడిపేందుకు వీలుగా తన విదేశీ పర్యటనను పెట్టుకున్నట్లుగా కోర్టుకు జగన్ వెల్లడించారు. యూకే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్.. మొబైల్ నెంబరు.. మొయిల్ ఐడీకి సంబంధించిన వివరాల్ని అధికారులకు ఇవ్వాలని కోర్టు సూచన చేసింది.
అంతేకాదు.. ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్ పోర్టు జారీకి సైతం ఓకే చేస్తూ సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. తాజాగా సీబీఐ కోర్టు అనుమతుల నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటన ఇరవై రోజులు సాగనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఏడాదిలో ఇది రెండో విదేశీ పర్యటనగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లటం తెలిసిందే. మే 17 నుంచి జూన్ ఒకటి వరకు ఆయన ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. ఆ సందర్భంగా బ్రిటన్.. స్విట్జర్లాండ్.. ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించిన ఆయన.. తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం.
ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత నుంచి బెంగళూరులో ఉంటున్న జగన్.. వారంలో మూడు రోజులు అక్కడ.. నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండేలాఆయన ప్లానింగ్ ఉందని చెబుతున్నారు. మొదట్లో బెంగళూరుకు పరిమితమైనట్లుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తాడేపల్లికి తరచూ వస్తున్నారు. జగన్ తో పాటు.. కేసులు ఉన్న ఆయన సన్నిహితుడు విజయసాయి రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వీలుగా అనుమతుల కోసంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఫారిన్ ట్రిప్ విషయంలో ఈ నెల 30న కోర్టు తన తీర్పును వెలువరించనుంది. తాజా టూర్ లో బ్రిటన్ లోని తన కుమార్తెతో గడపటంతో పాటు.. చుట్టుపక్కల యూరోపియన్ దేశాల్లోనూ పర్యటించే వీలుందని చెబుతున్నారు. పూర్తిగా పర్సనల్ ట్రిప్ కావటంతో.. షెడ్యూల్ విషయంలో వివరాల్ని బయటకు వెల్లడించని పరిస్థితి.