సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్ అంటారు కానీ.. నటీనటులు.. దర్శకులు.. సంగీత దర్శకులు.. గాయకులు.. ఇలా కొందరికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. సినిమా అనే మహా యజ్ఞానికి పని చేసే వారెందరో. అందరి సమిష్టి కష్టానికి ఫలితం మాత్రం చాలా కొద్దిమందికే సొంతమవుతుంటుంది.
కానీ.. తళుకుబెళుకులకు ఫిదా అయిపోయి.. వాటిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేవారెందరో. అలాంటి వారికి అసలు వాస్తవాలు అర్థం కావటం.. వెనక్కి వెళ్లిపోలేక కొందరు సతమతమైతే.. మరికొందరు తాము జీవితంలో ఎప్పుడూ ఊహించలేని జీవితాలకు అడ్జెస్ట్ అయిపోతారు.
సినిమా మీద సంపూర్ణ అవగాహన.. ప్లానింగ్ లేకుండా వస్తే ఇంతే అన్న విషయాన్ని వివరంగా చెప్పే వారు పెద్దగా కనిపించరు. సినిమా ప్రపంచానికి సంబంధించిన వారు ఇచ్చే ఇంటర్వ్యూల్లో చేదు నిజాలు చాలా వరకు రావు. వారి మాటలన్ని తీపి గుళికల్లా ఉన్నా.. దాని వెనుకుంటే చేదు చాలా తక్కువగానే బయటకువస్తుంది.
ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ ఫత్రికలో వచ్చిన ఒక ఇంటర్వ్యూ ఆసక్తికరంగానే కాదు.. ఆలోచించేలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ ఇంటర్వ్యూను చేసిందిన ఒక మహిళా కాస్టింగ్ డైరెక్టర్. ఈ విభాగం గురించి పెద్దగా తెలీదే? అదొకటి ఉందా? అన్న భావన కలిగిందా? అయితే.. మీరు ఈ కథనం మొత్తాన్ని చదవాల్సిందే. అలాంటి పనిని దాదాపు ఎనిమిదేళ్లుగా చేస్తున్న పుష్ప భాస్కర్ చెప్పే ‘సినిమా’ మాటల్ని విన్న తర్వాత.. జ్ఞాననేత్రాలు తెరుచుకోవటం ఖాయం.
ఆమె చెప్పే విషయాల్లోకి వెళ్లే ముందు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏమిటంటే? ఒక సినిమాకు పెద్ద సంఖ్యలో జనాల్ని సమకూర్చటం.. కొన్ని చిన్న పాత్రలకు సంబంధించి.. దర్శక నిర్మాత డిమాండ్లకు తగ్గట్లు నటీనటుల్ని గుర్తించి.. వారికి సమాచారం ఇవ్వటమే కాస్టింగ్ డైరెక్టర్లు చేయాల్సిన పని. సినిమా ఇండస్ట్రీలో కొందరికి దక్కే గౌరవ మర్యాదలు.. మిగిలిన వారందరికి దక్కదన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె ఒప్పుకునేందుకు.. వివరంగా చెప్పేందుకు పెద్దగా మొహమాటపడరు.
పుష్ప భాస్కర్ వద్ద తొమ్మిది నెలల పాపాయి నుంచి 80 ఏళ్ల వరకు వేలాది ప్రొఫైల్స్ ఉంటాయి. దర్శకుడి దగ్గర తొలుత కథ వినటం.. వారి బడ్జెట్ కు తగ్గట్లు ఏ పాత్రకు ఎవరు సరిపోతారో చూసుకొని ఆడిషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు నిర్మాతలైతే.. తమది చిన్న సినిమా అని.. హీరోయిన్ కు రూ.50వేలే ఇస్తామని చెప్పి.. వారికి ఏమేం అవసరమవుతాయో చెప్పే వారు కూడా ఉంటారట. అలాంటి వారి డిమాండ్లకు తగ్గట్లు సదరు హీరోయిన్ ను వెతికి పెట్టటం తమ పనిగా చెబుతారు. ఇంత చేసినా.. కొంతమంది నిర్మాతలు టైటిల్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ పేర్లు వేయరన్న కఠిన నిజాన్ని ఆమె చెబుతారు.
– 1987లో హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేరా. తర్వాత న్యూస్ రీడర్ శిక్షణ తీసుకున్నా. ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎమ్లో ఆర్జేగా. ‘హజ్బెండ్ స్పెషల్’ ప్రోగ్రామ్‌ను ఆరువందల ఎపిసోడ్స్ చేశా. ఆ ఉద్యోగం మానేశాక.. ‘లక్ష్మి టాక్ షో’, ‘ప్రేమతో లక్ష్మి’ కార్యక్రమాలకు రచయితగా పని చేశా. అన్నపూర్ణ స్టూడియో యాక్టింగ్ స్కూల్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్‌గా చేశా. ఆడిషన్ టెక్నిక్స్, డబ్బింగ్ పాఠాలను చెప్పాను. బంగారం తాకట్టు పెట్టి కోర్సులో చేరినవారినీ చూశా. ఆ బాధతోనే కాస్టింగ్ డైరక్టరవుదామనుకున్నా.
– ఫిల్మ్ కోర్సు చదివిన విద్యార్థులకు ఏడాదిన్నర పాటు ఉచితంగా అవకాశాలిప్పించా. బాలీవుడ్ మాదిరే ప్రొఫెషనల్‌గా ‘కాస్టింగ్ డైరక్టర్’ కావాలనుకున్నా. ఎనిమిదేళ్ల క్రితం ఎలాంటి వ్యవస్థ లేదిక్కడ. మొండిగా పనిచేశా. మా ఆయన బ్యాంకులో పనిచేయడం, పిల్లలు స్థిరపడటంతో ధైర్యంగా ముందడుగేశా.
– ‘పోస్ పోరీస్’ వెబ్‌సిరీస్‌తో కాస్ట్ డైరక్టర్‌గా పేరొచ్చింది. ఇప్పటి వరకూ 15 వెబ్‌సిరీస్‌లకు కాస్టింగ్ డైరక్టర్‌గా పనిచేశా. ‘కథానాయకుడు’, ‘డియర్ కామ్రేడ్’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘నారప్ప’, ‘తలైవి’ లతో పాటు ‘బంగార్రాజు’, ‘రంగమార్తాండ’.. ఇలా నలభై సినిమాలకు పైగా కాస్టింగ్ డైరక్టర్ని.
– కొందరైతే ‘ఉచితంగా నటించమనండి. లైఫ్ ఇస్తున్నాం’ అంటారు. వాళ్లిచ్చే అవకాశాల వల్ల తిండి, అద్దె రాదు. జాతర సీన్లో చివరి వరుసలోని నటులూ అత్యవసరమే. కేవలం కథానాయకుడు, నాయిక ఉంటే.. ఆ సన్నివేశం పండదు కదా!
– ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో ఓ పాత్రలో మా అబ్బాయి నటించాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మిక అమ్మమ్మగా నటించింది మా అమ్మనే. అప్పటికి ఆమెకు ఎనభై రెండు సంవత్సరాలు. ఆమె లేరిప్పుడు. ఇప్పటికీ అమ్మ కోసం ఫోన్లు వస్తాయి.
– సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి నాదో సలహా. ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. ఆన్లైన్ ఉద్యోగాలు లేదా అరటిపండ్ల బండైనా ఉండాలి. నటించకపోతే జీవితమే లేదనటం, ఆర్థిక సమస్యలుంటే.. ప్రలోభాలకు లొంగిపోయే దుస్థితి ఉంటుంది.
– 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్ డైరక్టర్’ పదమే లేదు. దర్శకత్వంలో భాగమనుకుంటారు. చాలా మందికి కాస్టింగ్ మేనేజర్, కాస్టింగ్ డైరక్టర్‌కి తేడా కూడా తెలీదు.
– కళ్లజోడుతో స్టిల్ దిగితే ఆడిషన్‌కి పనికిరాదు. సెల్ఫీలు, టిక్‌టాక్స్, రీల్స్ పనికి రావు. ముఖ్యంగా టిక్‌టాక్స్, రీల్స్ చేసేవాళ్లంతా నటులు కాలేరు. కెమెరా ఆన్ చేయగానే డీలా పడిపోతారు. కష్టపడితేనే నటుడు తయారవుతాడు.
ఆమె ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడొచ్చు.