వైసీపీ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగిస్తోందా? ఆమెపై కేసులు నమోదు చేసేం దుకు.. పోలీసులు రెడీ అవుతున్నారా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ నాయకులు. వాస్తవానికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. మంత్రిగా కూడా పనిచేశారు. పనితీరు.. శాఖల విషయంలోనూ.. లంచాల విషయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ, ఎటొచ్చీ.. ఎన్నికలకు ముందు తమను బెదిరించారంటూ.. రజనీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికలకు ముందు రజనీ తమను బెదిరించారని.. తమ నుంచి డబ్బులు వసూలు చేశారని ఇప్పటికి ఇద్దరు వ్యక్తులు పోలీసులను, స్థానిక ఎంపీనిఆశ్రయించారు. వీరిలో ఒకరికి సొమ్ములు తిరిగి ఇప్పించారు. మరొకరికి పెద్ద మొత్తం కావడంతో ఏం చేయాలన్న విషయంపై ఆలోచన చేస్తున్నారు. ఇంకోవైపు రాజీక యంగా రజనీపై కేసులు పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో విడదల రజనీ కాస్తా.. ఇప్పుడు గొడవల రజనీగా మారిపోయారన్న కామెంట్లు తెరమీదికి వచ్చాయి.
ఏం జరిగింది?
ఎన్నికలకు ముందు మంత్రి హోదాలో ఉన్న రజనీ.. స్థానికంగా ఉన్న క్రషర్ కంపెనీల యజమానిని బెదిరించి సుమారు రెండున్నర కోట్ల రూపాయలను వసూలు చేశారని చలపతిరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ సొమ్మును తమకు ఇప్పించాలని కోరారు. దీనిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే.. ఇంత పెద్ద మొత్తం తిరిగి ఇప్పించే విషయంలో తాము వేలు పెడితే.. అది సివిల్ కేసు అవుతుందని.. భావిస్తున్న పోలీసులు.. ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇంతలోనే దీనిపై ఉప్పందుకున్న టీడీపీ నాయకులు.. రజనీపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా రు. ఇటీవల కూడా ఓ రైతు చేసిన ఫిర్యాదుపై ఎంపీ కృష్ణదేవరాయులు స్పందించి.. రజనీ అనుచరుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇప్పించారు. ఇప్పుడు మరో కేసు వెలుగు చూడడంతో ఎంపీపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రజనీపై కేసు పెట్టి.. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో.. అందరినీ వెలుగులోకి తీసుకురావాలన్న దిశగా టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నారు. మరి రజనీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.