ఇటీవల మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా పవన్ ను, జనసేన కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారిని దాటుకొని పవన్ ఇప్పటం గ్రామంలో తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగానే ఆ గ్రామానికి చేరుకోవడానికి ముందు పవన్ తన కారు టాప్ పై కూర్చుని ప్రయాణించారు.
అలా పవన్ ప్రయాణించిన వీడియో వైరల్ గా మారింది. కారు టాప్ పై కాళ్లు బారజాపుకొని పవన్ ప్రయాణించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ వ్యవహారం నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. తాడేపల్లి పోలీసులకు శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు ఐపిసి సెక్షన్ 336, రెడ్ విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. కారు టాప్ పైన కూర్చుని ప్రయాణించడం ప్రమాదకరం అని శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాదు, పవన్ కాన్వాయ్ ని అనేక వాహనాలు అనుసరించాయని, ఈ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా జరిగిందని తన ఫిర్యాదులో శివకుమార్ పేర్కొన్నారు. అయితే, పవన్ టూర్ సక్సెస్ కావడంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తాజాగా పవన్ పై కేసు నమోదు చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మరి, ఈ వ్యవహారం పై పవన్, జనసేన నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, నిన్న రాత్రి ప్రధాని మోడీతో విశాఖలో పవన్ భేటీ అయిన గంటల వ్యవధిలోనే పవన్ పై కేసు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, పవన్ కారు టాప్ పై ప్రయాణించిన ఘటన జరిగి చాలా రోజులవుతోందని, కేసు పెట్టాలనుకున్న వారు ఇంకా ముందుగానే పెట్టి ఉండవచ్చు కదా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.