టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ నేతలపై వైసీపీ నేతలు, మంత్రులు అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బూతుల మంత్రిగా టీడీపీ నేతలు విమర్శించే కొడాలి నాని నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. కానీ, వైసీపీ నేతలను టీడీపీ నేతలు విమర్శిస్తే మాత్రం అధికార పార్టీ అధినేతకు కోపం వస్తుంది. తనను, తన పార్టీ వారిని పల్లెత్తు మాట అన్నా సరే టీడీపీ నేతలపై కేసులు పెట్టించి జగన్ కక్ష సాధిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసు కేసు నమోదైంది. జగన్ ను దూషించారనే ఫిర్యాదుతో ఆయనపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ను దుర్భాషలాడారంటూ వైసీపీ నేత రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో జగన్ ను అయ్యన్న దూషించారని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో, అయ్యన్నపై ఐపీసీ సెక్షన్లు 153 ఏ, 505 (2), 506 కింద కేసు నమోదైంది.
ఇలా అయ్యన్నపై జగన్ కక్ష సాధించడం ఇది తొలిసారేం కాదు. గతంలో కూడా అయ్యన్నపై ఈ తరహాలో ఓ కేసు నమోదైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో అయ్యన్న వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను దూషించారంటూ న్యాయవాది వేముల ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సుచరిత సామాజిక వర్గం నేపథ్యంలో అప్పుడు అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.