వరుస పెట్టి దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటూ.. తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల మీద కత్తి కడుతున్న కెనడా ప్రభుత్వం తాజాగా మరో దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే తమ దేశానికి చదువుకోవటానికి వచ్చే విద్యార్థుల డిపాజిట్ సొమ్మును రెట్టింపు చేసిన ప్రభుత్వం.. తాజాగా మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ ను కట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో ప్రభుత్వం.. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ సేవలపైనా కోత పెట్టింది. ఈ క్రమంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ సౌలభ్యాన్ని కల్పించకూడదని డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థులకు షాకిచ్చేలా మారింది. మన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెబుతున్నారు.
ఆహార ధరలు..నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. విదేశీ విద్యార్థుల విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగా తాజా నిర్ణయాన్ని చెప్పొచ్చు. కెనడాలో భారీగా పెరిగిన జీవన వ్యయ భారం నేపథ్యంలో ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. ఒక లెక్క ప్రకారం మార్చిలో 20 లక్షల మంది పుడ్ బ్యాంకులను ఆశ్రయించారు.
ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు విద్యార్థులు అయ్యారు. జీవన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈవో కిర్ స్టిన్ బియర్డ్ స్లీ చెబుతున్నారు. ఈ మధ్యనే కెనడాకు ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల స్టూడెంట్ వీసా డిపాజిట్ ను డబుల్ చేసింది. గతంలో 10 వేల డాలర్లుగా ఉంటే.. దాన్్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి 20,635కు పెంచారు.
అయినప్పటికీ ఏదో ఒక సాకు చెప్పి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఫుడ్ బ్యాంక్ వసతిని తీసేయటంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో ఉన్నత విద్యాభాస్యం మెరుగ్గా ఉంటుందని భావించిన ప్రతి విదేశీ విద్యార్థికి ఇటీవల కాలంలో కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు షాకుల మీద షాకులు ఇస్తున్న దుస్థితి.