తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తాజా సర్వేలో బయటపడింది. ఐదు రాష్ట్రాల్లోని జనాల అభిప్రాయాలు ఎలాగున్నాయో తెలుసుకునేందుకు టౌమ్స్ నౌ మీడియా సంస్ధ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో కమలంపార్టీ క్లీన్ స్వీప్ చేయటం ఖాయమట. అలాగే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)దే విజయమని తేలిపోయింది. మణిపూర్ ఫలితాలను మాత్రం టౌమ్స్ నౌ ప్రకటించలేదు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ఫలితాలపై గతంలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేల్లో కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చింది. కాకపోతే ఇపుడున్నన్ని సీట్లు రావని కూడా అర్ధమైంది. తాజా సర్వేలో యూపీలో బీజేపీ కూటమికి 227-254 మధ్యలో సీట్లు రావచ్చని చెప్పింది. అధికారం కోసం తివ్రంగా శ్రమిస్తున్న ఎస్పీ కూటమికి 151 సీట్లు రావచ్చు. మెజారిటి జనాలు యోగీకే సీఎంగా జిందాబద్ చెప్పారట.
అలాగే ఉత్తరాఖండ్ లో బీజేపీకి 44-50 మధ్యలో సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ కు 15 సీట్లు వస్తాయట. గోవాలో కూడా 21 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందట కమలంపార్టీ. అయితే ఇక్కడ బీజేపీ పై జనాల్లో వ్యతిరేకత బాగా ఉందని తేలింది. ఆప్ 11 సీట్లతో ప్రధానప్రతాపక్షం హోదాను తక్కించుకుంటుందని తేలింది. ఇక పంజాబ్ లో ఆప్ సుమారు 50 సీట్లతో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలుస్తుందట. కాబట్టి అధికారం అందుకోవటం దాదాపు ఖాయమనే అనుకోవాలి.
ఒకవైపు నరేంద్రమోడీ పరిపాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనబడుతోంది. అయినా మూడు రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి రావటమంటే మామూలు విషయం కాదు. మళ్ళీ అధికారంలోకి ఎలా రాబోతోందంటే ప్రతిపక్షాల బలహీనత, ఐనైక్యతే కారణమని అర్ధమవుతోంది. ప్రతి రాష్ట్రంలోను కాంగ్రెస్ కు ధీటుగా ప్రాంతీయ పార్టీలు బలపడటం, కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగానే ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడుతోందని అర్ధమవుతోంది.