కర్నూలు జిల్లాలో ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు చక్రం తిప్పుతున్నారు. అధికారుల నుంచి పార్టీ వర్గాల వరకు కూడా అందరినీ తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఎవరికి ఏ పనికావాలన్నా.. ఆ రెడ్డి నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఎవరైనా నేరుగా వెళ్లి ఎమ్మెల్యేను కలిసి.. పనిచేయాలని కోరినా.. ఆయన చేయలేక పోతున్నారు. చూద్దాం.. చేద్దాం.. అనే అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేను ఆశ్రయించినా.. ఆయనకు చెప్పుకొన్నా పని జరిగే అవకాశం లేదనే ప్రచారం జోరుగా జరుగుతుండడం గమనార్హం.
వాస్తవానికి కేవలం ఎస్సీ నాయకుడు మాత్రమే అన్నీతానై వ్యవహరించాల్సిన చోట.. జనరల్ కేటగిరీకి చెందిన యువ నాయకు డు చక్రం తిప్పడం ఏంటి? అలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నలు సర్వసాధారణం.
విషయంలోకి వెళ్తే.. నందికొట్కూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆర్థర్ విజయం సాధించారు. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. ఆయన గెలిచేందుకు సాయం కూడా చేశారు. అయితే.. ఆయన ప్రమేయం లేకుండానే బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని ఇక్కడ ఇంచార్జ్‌గా జగన్ నియమించారు.
సీనియర్ పొలిటీషియన్.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దూకుడు పెరిగింది. గతంలో ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట ఓ ఉద్యమపార్టీని స్థాపించి.. తద్వారా.. గుర్తింపు పొందారు. అంతకు ముందు టీడీపీ నాయకుడిగా కూడా చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డి.. తరచుగా జగన్‌ను టార్గెట్ చేసేవారు. తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ రెడ్డికి.. సీఎం జగన్ ప్రాధాన్యమిచారు. నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా నియమించారు. అయితే.. సిద్దార్థ రెడ్డి దీనిని ఆసరాగా చేసుకుని.. అంతాతానై వ్యవహరిస్తున్నారు. దీంతో అనధికార ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తున్నారనే టాక్ సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.
ఈ ఇద్దరి మధ్య ఆది నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం వాహనాలు కేటాయించింది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక, వాహనాల కేటాయింపుల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. నందికొట్కూరులో మాత్రం అంతా తానే అయి.. లబ్ధి దారుల ఎంపిక నుంచి వాహనాల కేటాయింపు వరకు సిద్ధార్థ కనుసన్నల్లోనే జరిగిపోయాయి. ఇక, అధికారులు కూడా సిద్ధార్థ చెప్పినట్టే వ్యవహరించారు.
దీనిపై అలక వహించిన ఆర్థర్.. విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పారు. కానీ, వారి నుంచి సరైన మాట రాలేదు. దీంతో కింది స్థాయిలో అదికారులతో మాట్లాడి సర్దుబాటు చేసుకున్నారట. అంటే.. దాదాపు సిద్ధార్థ రెడ్డి విషయంలో ఆర్థర్ ఇక సర్దుబాటుధోరణిని అవలంబించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త.. కర్నూలు వైసీపీ నేతల్లో హాట్ టాపిక్‌గా మారింది.