2400 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ఉన్న ఓ యువకుడు పూటుగా మందుతాగి.. పొరుగింటి యువతి ఇంట్లో పడుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే.. ఇది మన దేశంలో కాదు.. అమెరికాలో చోటు చేసుకుంది.
తనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి ఇంట్లోకి ఓ భారీ కంపెనీ సీఎఫ్‌వో వెళ్లి అక్కడున్న మంచంపై పడుకొన్నాడు. ఈ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని అర్కాన్సస్‌లో చోటు చేసుకొంది.
ఆహార రంగంలో పేరున్న ‘టైసన్ ఫుడ్స్’ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ టైసన్ (32) పీకలదాకా మద్యం తాగాడు. ఈ క్రమంలో అతడు ఓ యువతి ఇంట్లోకి వెళ్లి బట్టలు విప్పేసి మంచంపై పడుకొన్నాడు. ఆ సమయంలో ఆ యువతి ఇంట్లో లేదు.
ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో ఎవరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా టైసన్‌ను గుర్తించారు. పోలీసులు జాన్ టైసన్‌ను నిద్రలేపేందుకు యత్నించినా.. అతడు మత్తు నుంచి తేరుకోలేదు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి.. వాషింగ్టన్ కౌంటీలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
అక్కడ 415 డాలర్ల(సుమారు 32 వేలు)కు బాండ్ తీసుకొని విడిచిపెట్టారు. డిసెంబర్ 1వ తేదీన అతడు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈయన ప్రస్తుత టైసన్ ఫుడ్స్ ఛైర్మన్ జాన్ హెచ్ టైసన్‌కు వారసుడు. అక్టోబర్ 2వ తేదీనే ఇతడు కంపెనీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌గా ప్రమోషన్ అందుకొన్నాడు.
గతంలో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. ఈ ఘటనపై టైసన్ ఫుడ్స్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం టైసన్ ఫుడ్స్ మార్కెట్ విలువ 24 బిలియన్ డాలర్లకుపైగా(2400 కోట్లు) ఉంది.