ఉక్కునగరంగా పేరున్న విశాఖపట్నంలో పెను విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి వేళలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ ఉదంతంలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. మరొకరు బిహార్ కు చెందిన వారుగా గుర్తించారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత విశాఖ కలెక్టరేట్ కు సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
భవనం కుప్పకూలిన సమయంలో మొత్తం 8 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు మరణించగా.. మిగిలిన ఐదుగురు గాయాలపాలు కాగా.. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. విషాదకరమైన అంశం ఏమంటే.. పుట్టిన రోజు వేడుక చేసుకున్న రోజునే కన్నుమూయటం పలువురిని కంట తడి పెట్టిస్తోంది.
విశాఖకు చెందిన పద్నాలుగేళ్ల అంజలి రామారావు.. కల్యాణి దంపతుల రెండో సంతానం. ఆమె నిన్ననే పుట్టిన రోజు వేడుక చేసేుకుంది. ఈసారి ఆమె పుట్టిన రోజునే ఉగాది పండుగ కూడా రావటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపింది. ఇది జరిగిన కొన్ని గంటలు కూడా కాక ముందే.. భవనం కూలిన ఉదంతంలో తన సోదరుడి పాటు ఆమె కూడా కన్నుమూసింది. కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు సంతానం భవనం కుప్పకూలిన ఉదంతంలో మరణించటంతో ఆ తల్లిదండ్రుల శోకాన్ని ఆపటం ఎవరి తరం కావటం లేదు.
భవనం కుప్పకూలిన ఉదంతంలో.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భవనం కుప్పకూలిన ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే రెవెన్యూ.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. భవన శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. వారు గాయాల పాలు పడటంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
https://twitter.com/teja08352/status/1638710082111430658