టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు బ్లాక్ కమాండోల భద్రత ఎందుకని, ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తీసేయాలని తమ్మినేని చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. చంద్రబాబుకు భద్రత తొలగించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని తమ్మినేని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చచ్చే వరకు టీడీపీలోనే ఉంటానని తమ్మినేని… వైసీపీలో చేరిన తర్వాత ప్రజల సొమ్ము తిని పందిలా బలిశారని ఎద్దేవా చేశారు.వైసీపీలో చేరిన తమ్మినేని బురద పందిలా మారి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాబోయే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని, అంకుశం సినిమాలో రామిరెడ్డి మాదిరి ఆముదాలవలస రోడ్డుపై తమ్మినేని రోడ్డు మీద ఉండాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబునే ఫినిష్ చేస్తానని అంటావా? నీకు బుద్ధి ఉందా? అని మండిపడ్డారు.
తల్లి పేరు చెప్పుకుని అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారని, వివేకా కేసులో జగనే ఎక్కువగా భయపడుతున్నారని అన్నారు. జనాల దగ్గరకు డేరాలు కట్టుకుని వెళ్లే జగన్ డేరాబాబా అని సెటైర్లు వేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, వెనకస్తు ఎన్నికలు వచ్చినా గెలిచేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల్లో పేదలకు జగన్ ఇంటి స్థలాలు ఇవ్వాలని, 600 ఎకరాల్లో విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్ నాథ్ లు బినామీ పేర్లతో వెంచర్లు వేశారని ఆరోపించారు.