టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. గత కొద్ది రోజుల నుంచి వల్లభనేని వంశీ కోసం పోలీసుల గాలిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. కేసులో ఏ71గా ఉన్న వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం వంశీ అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లుగానే మిగిలాయి. ఇదే తరుణంలో వంశీ అమెరికా వెళ్లిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్న వంశీపై విమర్శల దాడికి దిగారు. `వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ నోరు దూలతో ఇష్టమొచ్చినట్టు వాగాడు. నాడు చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా అడ్డగోలుగా మాట్లాడాడు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించాడు. ఇవాళ అధికారం పోగానే దాక్కుని బతుకుతున్నాడు` అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవ చేశారు.
వంశీ ఒక నమ్మక ద్రోహి, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, నాయకుడిపైనే విషం చిమ్మాడు. వైఎస్ చనిపోతే వంశీ పార్టీ చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ పార్టీలో చేర్చుకున్నాడంటూ బుద్దా విమర్శలు కురిపించారు. వంశీ చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సింహం సింగిల్‌గా వస్తుందని డైలాగ్‌లు వేసిన జగన్ రెడ్డి.. ఎన్నికల తర్వాత గజనీ రెడ్డిగా మారారంటూ మాజీ సీఎం పై సైతం బుద్దా సెటైర్లు పేల్చారు.