ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్లు పెట్టి పురాణమంతా చెప్పేందుకు, నేరస్థులను దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకెళ్లి పరామర్శించేందుకు సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం జగన్ కు మొహం చెల్లట్లేదు అంటూ అధికార పార్టీ నేతలే చురకలు అంటిస్తున్నారు. అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు.
తాజాగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి సైతం జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు. గత కొన్నేళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి ఓట్లు వేసి గెలిపిస్తున్న పులివెందుల ప్రజలంటే జగన్ కు ఏమాత్రం ప్రేమ లేదని బీటెక్ రవి అన్నారు. పులివెందులలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత జగన్ కు ఉన్నా.. ఏం పట్లనట్లు ఉంటున్నారని రవి మండిపడ్డారు.
పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ జగన్ కు ఈ సందర్భంగా బీటెక్ రవి ఆఫర్ కూడా ఇచ్చారు. అలాగే జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని.. ఈసారి మళ్లీ జగన్ నిలబడ్డా ప్రజలు ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి ఉండదని రవి వ్యాఖ్యానించారు.