విజయవాడ నడిబొడ్డులో పారిశ్రామికవేత్త కరణం రాహుల్ (29) హత్యోదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో కారులో రాహుల్ మృతదేహం లభిచడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. రాహుల్ మృతదేహం డ్రైవింగ్ సీట్లో పడిఉంది. అతడి చేతులను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు వెనక్కి లాగి విరిచి పట్టుకొని , పక్కన కూర్చున్న వ్యక్తి దిండుతో ముఖంపై నొక్కడంతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
వ్యాపార వాటాల్లో వివాదం నేపథ్యంలోనే రాహుల్ హత్య జరిగిందని, ఈ మర్డర్ లో వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడు రాహుల్ తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీషీటర్ కోగంటి సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఓ వ్యాపారానికి సంబంధించి రాహుల్ కు చెందిన మొత్తం వాటా తానే తీసుకుంటానని కోగంటి సత్యం ముందుకు రాగా…అందుకు రాహుల్ అంగీకరించలేదని తెలుస్తోంది.
ఎవరీ కోగంటి సత్యం?
కోగంటి సత్యం పేరు చెబితే బెజవాడ ప్రజలు బెెంబేలెత్తుతారు. బెజవాడకు చెందిన ఈ రౌడీషీటర్ క్రైమ్ హిస్టరీ ఓ రేంజ్ లో ఉంది. పాత సీసాలు కొనే స్థాయి నుంచి కోట్లకు అధిపతి అయిన కోగంటి సత్యం చరిత్ర నేరమయం. గొడవలు, దాడులు, మోసాలు, కిడ్నాప్ లు, భూకబ్జాలు, మర్డర్లు ఇలా ఒకటేమిటి…అతడు చేయని నేరమంటూ లేదు. కోగంటి సెటిల్మెంట్లు చేసే అడ్డాను కోగంటి దొడ్డిగా బెజవాడ ప్రజలు పిలుస్తుంటారు.
విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కోగంటిపై 30కి పైగా కేసులున్నాయి. తనకు అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ పైకొచ్చిన కోగంటి సత్యం…చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో కోగంటి ప్రధాన నిందితుడు. సినీ నటి వహీదా రెహ్మాన్ కూడా కోగంటి బాధితురాలే. కోగంటి సత్యంపైనా అనేకసార్లు హత్యాప్రయత్నం జరిగినా తప్పించుకున్నాడు.
అయితే, రాహుల్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి చెబుతున్నారు. రాహుల్ కంపెనీ రెండేళ్ల క్రితం కొందామనుకున్నానని, కానీ రేటు ఎక్కువ చెప్పడంతో విరమించుకున్నానని కోగంటి చెబుతున్నారు. వ్యాపార లావాదేవీలు సెటిల్ చేసి గొడవను సర్దుబాటు చేసేవాడినని, ఇంతదూరం రానివ్వచ్చేవాడిని కాదని కోగంటి సత్యం చెప్పారు.