అమావాస్య ముందు కేసీఆర్ కు షాక్ తగిలింది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య సన్నివేశాలు తెర మీదకు వస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలోకి విపక్ష నేతలు వెళ్లిపోవటం.. ప్రజాప్రతినిధులు అధికార పక్ష కండువాలు కప్పుకోవటం మామూలే. అయితే.. అంచనాలకు భిన్నంగా.. ఏ మాత్రం లీకేజీలు లేకుండాతెర మీదకు వస్తున్న వరుస సన్నివేశాలతో తెలంగాణ రాజకీయం మస్తు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. తమ ప్రభుత్వాధినేతగా రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పటం తెలిసిందే.
ఒక్కొక్కటిగా గులాబీ ఎమ్మెల్యేలను హస్తం గూటికి తెస్తున్న రేవంత్.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 8 స్థానాల్ని సొంతం చేసుకోవటం ద్వారా తన సమర్థతను చాటి చెప్పారు. ఇది సరిపోనట్లుగా ఇటీవల కాలంలో వరుస పెట్టి ఎమ్మెల్యేల్ని తన గూట్లోకి వచ్చేలా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం షాకింగ్ గా మారింది.
గురువారం అర్థరాత్రి వేళలో.. ఒకేసారి ఆరుగురు గులాబీ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి రావటం.. పార్టీలో చేరటం లాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆషాఢం అమావాస్యకు రోజు ముందు.. అర్థరాత్రి వేళలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంత పెద్ద రాజకీయ సంచలనాన్ని ఏ మీడియా సంస్థ అంచనా వేయలేకపోయింది. అంతేనా.. విపక్షం సైతం పసిగట్టలేకపోయింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు.. రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతి రోజునే.. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కాసేపటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆ ఆరుగురు ఎవరంటే..
1. బస్వరాజు సారయ్య
2. భానుప్రసాదరావు
3. ప్రభాకర్ రావు
4. దండె విఠల్
5. బొగ్గారపు దయానంద్
6. యెగ్గె మల్లేశం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ.. మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ వారికి కండువాలు కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజానికి వీరు వారం క్రితమే పార్టీలో మారాల్సి ఉన్నా.. కొన్ని సాంకేతిక అంశాల కారణంగా పార్టీలో మారని పరిస్థితి. మరికొద్ది వారాల్లో బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యే వేళ.. ఆషాఢమాసం వస్తుండటంతో చేరికల మీద కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. దీంతో.. పార్టీ మారాలని భావించిన ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి కొంతమేర చర్చలు జరిగిన తర్వాత సీఎం రేవంత్ ఇంటికి వెళ్లారు.
అక్కడ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువాలు కప్పేసి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రాజకీయ పరిణామం షాకింగ్ గా మారింది. ఇలా అర్థరాత్రి వేళ.. పార్టీ మారటం ఒక ఎత్తు అయితే.. ఒకే దఫా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారిన వైనం గులాబీ బాస్ కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ను ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యనే అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్లు చేరటం తెలిసిందే. మొత్తంగా ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.