జనసేనలోకి తొందరలోనే బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ చేరబోతున్నట్లు సమాచారం. ఒకపుడు జనసేనలో కీలకంగా వ్యవహరించిన తోట తర్వాత పరిస్ధితుల్లో బీఆర్ఎస్ లో చేరారు. మొన్నటి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతోబలంగా కనిపించిన బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకున్నది. దాని అధినేత కేసీయార్ మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, ఏపీ పై ఎక్కువగా దృష్టిపెట్టారు. ఇందులో బాగంగానే ఏపీకి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించారు. తోట కూడా కొద్దిరోజులు యాక్టివ్ గానే తిరిగారు.
అయితే తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో పార్టీ ప్రాభవం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తెలంగాణాలోని ఇబ్బందులు పడుతున్న కారణంగా మిగిలిన రాష్ట్రాల్లో విస్తరణను ఇపుడు పట్టించుకోవటంలేదు. ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాతే ఏపీ చీఫ్ తోట బీఆర్ఎస్ ను వదిలేయాలని అనుకున్నట్లు సమాచారం. అందుకనే తొందరలోనే జనసేనలో చేరుతారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. జనసేనలో చేరగానే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
బీఆర్ఎస్ నుండి జనసేనలో చేరగానే తోటకు గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తారా అన్నది కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే టీడీపీ-జనసేన పొత్తులో ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? ఏ నియోజకవర్గాల్లో పోటీచేస్తుందనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ స్ధాయిలో ఇప్పటికే డిసైడ్ అయిపోయుంటాయి కాని అధికారికంగా ప్రకటన జరగలేదు. అందుకనే పోటీ విషయమై రెండుపార్టీల నేతల్లోను అయోమయం పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో తోట పార్టీలో చేరుతానని, గుంటూరు వెస్ట్ లో టికెట్ కావాలని అడిగితే పవన్ అంగీకరిస్తారా అన్నది కాస్తం అనుమానం.
ఇదే సమయంలో తోటకు టికెట్ ఇవ్వటానికి పవన్ అంగీకరిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ఆర్ధికంగా తోటకు చాలాబలమైన నేపధ్యమున్నది. కాబట్టి తోటకు టికెట్ ఇవ్వటం ద్వారా జనసేన అభ్యర్ధులకు నిధుల సమస్య ఉండదని పవన్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009,14 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన తోట ఓడిపోయారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.