పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తాము ఏమిచేస్తున్నామో కూడా తెలీకుండా అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తమకే ఓట్లు వేస్తామని గ్రామస్తులతో దేవాలయాలు, పంచాయితి ఆపీసుల ముందు ఎంఎల్ఏలు ప్రమాణం చేయించుకుంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాణాలు ఎక్కడా చెల్లవు. ఎందుకంటే నియోజకవర్గాల అభివృద్ధికి త్రికరణ శుద్ధితో, నిజాయితీగా పనిచేస్తామని చెప్పిన మాటలకు ఎంఎల్ఏలు కట్టుబడుంటున్నారా ?
ఎంతమంది ఎంఎల్ఏల మీద భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు వినబడటంలేదు ? తాము నిజాయితీతో పనిచేస్తే ఓటర్లను కూడా నిజాయితీగా ఉండమని అడిగే హక్కు ఎంఎల్ఏలకు ఉంటుంది. ఈరోజు ఓట్లేస్తామని ప్రమాణం చేసినా రేపు పోలింగ్ రోజున వేశారని గ్యారెంటీ ఏముంది ? మహబూబా బాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ చేయిస్తున్న ప్రమాణాలు చాలా వైలర్ అవుతున్నాయి. గ్రామాల్లోని ఓటర్లను కొందరిని ఊర్ల మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళతో ప్రమాణాలు చేయించుకుంటున్నారు.
ఇలాంటి ప్రమాణాలు నిలిచేవికావని అందరికీ తెలుసు. అయినా నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఇలాగే ప్రమాణాలు చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఓటమి భయం పెరిగిపోతున్నట్లుంది. గడచిన పదేళ్ళుగానో లేకపోతే ఐదేళ్ళుగానో నియోజకవర్గాల్లో చాలామంది ఎంఎల్ఏలు ఆకాశమంత ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఎన్నో అరాచకాలకు తెరలేపారు. దాంతో జనాల్లో ఎంఎల్ఏలపై బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. వద్దని చెప్పినా వినకుండా కేసీయార్ వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులకే చాలా చోట్ల టికెట్లిచ్చారు. దాంతో జనాలంతా ఇపుడు వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు.
చాలా గ్రామాల్లో ఎంఎల్ఏలను అసలు ప్రచారానికే రానీయటంలేదు. గ్రామాల్లో ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా జనాలు పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. అందులో ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా అనేక స్లోగన్లు రాయించారు. ఎంఎల్ఏల అవినీతిని కూడా అందులోనే ప్రస్తావించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఎంఎల్ఏల్లో ఓటమి భయం పెరిగిపోతున్నట్లుంది. కేసీయార్, కేటీయార్ పరిస్ధితే బాగాలేదన్న ప్రచారం బాగా పెరిగిపోతోంది. అందుకనే చివరాఖరుగా జనాలతో ఇలాంటి ప్రమాణాలు చేయించుకుంటున్నారు. తమకు బయపడకపోయినా కనీసం దేవుడికైనా భయపడి చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటారని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.