తమ విషయాలను ప్రత్యర్థి పార్టీ నేతలకు తెలియకుండా రాజకీయ నాయకులు ఎంతో జాగ్రత్త పడతారు. చిన్న సమాచారం లీకైనా అదెంతో ప్రమాదకరంగా మారుతుందని వాళ్లకు తెలియంది కాదు. కానీ ఒకే పార్టీలో ఉండే రాజకీయ నాయకుల మధ్య దాపరికాలు అంతగా ఉండవనే చెప్పాలి. ఒకే పార్టీ కాబట్టి ఏం సమస్య ఉండదనే అనుకుంటారు. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ జంపింగ్ లు జోరుమీదున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి నాయకులు మారారు. ఇంకా మారుతూనే ఉన్నారు. ఇలా మారిన నాయకుల నుంచి ఇప్పుడు అసలు సమస్య పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇన్ని రోజులు ఒకే పార్టీలో నాయకులు ఉండటంతో అన్ని విషయాలు పార్టీ లోపల అందరికీ తెలిసే జరిగాయని అనుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన నాయకులు తమ పాత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతిని, అక్రమాలను బయట పెడతామంటూ ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారే. వచ్చే 40 రోజుల ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతల అక్రమాలను వివరిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఇక కొన్ని రోజుల ముందు స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వర్సెస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నట్లు పరిస్థితి కొనసాగింది. దీంతో ఈ ఇద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీహరికి టికెట్ దక్కడం.. రాజయ్యను కేటీఆర్ బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తున్న నాయకులు కూడా ఇదే పంథాలో సాగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రూ.కోట్ల కోసం రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ లో సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదనే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలా ఉన్న నేతలు.. పార్టీ మారగానే పాత పార్టీని, నాయకులను లక్ష్యంగా చేసుకుని మాటలతో రెచ్చిపోతున్నారు.