ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రశ్నిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం, వారిని సభ నుంచి బయటకు పంపించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం నాడు వివాదాస్పద జీవో నెంబర్ ఒకటిపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
అయితే, క్వశ్చన్ అవర్ ప్రారంభమైన తర్వాత జీవో నెంబర్ ఒకటిపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ ఏం చేయాలో నిర్దేశిస్తున్నారు అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. తమ హక్కులను హరించవద్దంటూ స్పీకర్ ను టిడిపి సభ్యులు కోరారు. అయితే, నిబంధనలు పాటిస్తూ హక్కులు సాధించుకోవాలని తమ్మినేని అన్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని పలువురు మంత్రులు… స్పీకర్ ను డిమాండ్ చేశారు. ఈ దశలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు ప్రభుత్వ చీఫ్ తీర్మానాన్ని ప్రతిపాదించబోయారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తమపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పర ఆరోపణలకు దిగారు.
ఈ రసాభాస మధ్య సభ అర్ధాంతరంగా వాయిదా పడింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.