గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల కాంబోలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం వీరమాస్ హిట్టుగా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం బాలకృష్ణ తనయురాలు నారా బ్రాహ్మణి స్పందించారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి బ్రాహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో సన్నివేశాలు, డైలాగులు అన్ని చాలా బాగున్నాయని, నందమూరి అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు.
ఇక, నాన్న లాగా డైలాగులు చెప్పేవారు టాలీవుడ్ లోనే కాదు మొత్తం భారతదేశంలో కూడా మరెవరు లేరని బాలయ్య డైలాగ్ డెలివరీపై బ్రాహ్మణి ప్రశంసలు కురిపించారు. మరోవైపు, నారావారిపల్లెలో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా రంగోలి ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఆ పోటీలను పర్యవేక్షించిన అనంతరం మాట్లాడిన బ్రహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులంతా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని, గ్రామ ప్రజలతో కలిసి పండగ చేసుకుంటామని అన్నారు. గ్రామస్తులంతా ఎంతో ఉత్సాహంతో ముగ్గులు పోటీలలో పాల్గొన్నారని కితాబిచ్చారు.
తన తండ్రి నటించిన వీరసింహారెడ్డి చిత్రం చూసి చాలా ఎంజాయ్ చేశానని, మీరు కూడా చూసి ఆ సినిమా ఎంజాయ్ చేయాలంటూ పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నకు బ్రాహ్మణి జవాబిచ్చారు. మరోవైపు, భోగి సందర్భంగా నారా వాళ్ళు నారావారిపల్లెలో బాలయ్య బాబు భోగిమంటలు వేసి సందడి చేశారు. గ్రామంలో హుషారుగా జాగింగ్ చేస్తూ గ్రామస్తులు వేసిన భోగి మంట దగ్గర ఆగి వారితో మాటామంతి జరిపారు.
భోగి పండుగ అంటే మనకు సినిమా పండుగ అంటూ గ్రామస్తులతో చమత్కరించిన బాలయ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి మరుగున పడుతోందని, దానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఇటువంటి పండుగలు గ్రామాల్లో జరుపుకోవడం ఎంతో అవసరమని బాలయ్య అన్నారు. రాష్ట్రం సరైన నాయకత్వంలో ముందుకు వెళ్లాలని బాలయ్య ఆకాంక్షించారు.
చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్లో కుటుంబసమేతంగా బాలయ్య వీర సింహారెడ్డి చిత్రాన్ని వీక్షించారు. నారావారిపల్లి నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ చంద్రగిరికి బాలయ్య రావడం విశేషం. థియేటర్ దగ్గరకు బాలయ్య వస్తున్నారని తెలియడంతో భారీగా అభిమానులు అక్కడికి చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. థియేటర్ వద్ద 50 కేజీల భారీ కేక్ కట్ చేసి బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు.
అభిమానులు కోరుకున్న విధంగా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్ర బృందాన్ని బాలయ్య ప్రశంసించారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని, ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని బాలయ్య జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏదేమైనా తన తండ్రి లాగా డైలాగులు చెప్పేవారు దేశంలోనే లేరంటూ నారా బ్రాహ్మణి చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.